యాప్నగరం

శక్తులన్నీ ఏకం కావాలి.. బీజేపీని ఓడించాలి: సీతారాం ఏచూరి

భాగ్యనగరం ఎర్రబారింది. ఎటుచూసినా ఎర్రని తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి.

Samayam Telugu 19 Apr 2018, 6:14 pm
భాగ్యనగరం ఎర్రబారింది. ఎటుచూసినా ఎర్రని తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ జాతీయ నాయకులతో పాటు అతిరథ మహారథులందరూ హాజరు కాగా.. బుధవారం (ఏప్రిల్ 18) ఉదయం ఆర్టీసీ కళ్యాణ మండపంలో మల్లు స్వరాజ్యం జెండాను ఆవిష్కరించి మహాసభలను లాంఛనంగా ప్రారంభించారు. సామాజిక న్యాయం, మతోన్మాద శక్తులను గద్దె దించడం లాంటి ప్రధాన అజెండాలతో ఈ సమావేశాలు జరగనున్నాయి.
Samayam Telugu cpm


మహాసభల ప్రారంభోపన్యాసం చేస్తూ.. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్‌‌పై నిప్పులు చెరిగారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతోందని.. అవినీతి, అక్రమాలు హెచ్చుమీరుతున్నాయని మండిపడ్డారు. వ్యవసాయం సంక్షోభంలో పడిందని, యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు.

బీజేపీని ఓడించడానికి వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాలకు 22వ జాతీయ మహాసభలు దిశానిర్దేశం చేస్తాయని ఆయన వివరించారు. ప్రత్యామ్నాయ విధానాలు ఇచ్చే సత్తా లెఫ్ట్‌కే ఉందనీ.. వర్గ, సామాజిక పోరాటాలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు.

‘దేశంలో దళితులు, ముస్లింలే లక్ష్యంగా దాడులు పెరిగిపోయాయి. ఈ మతోన్మాదం దేశ ఐక్యతకు పెద్ద దెబ్బగా మారిందన్నారు. మతోన్మాదుల అరాచకాలను అడ్డుకునే శక్తి వామపక్షాలకు మాత్రమే ఉంది’ అని సీతారాం ఏచూరి అన్నారు. కథువా లాంటి ఘటనలు విషాదకరమని, చిన్నారులపై అత్యాచారాలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

సీతారాం ఏచూరి


అనంతరం రాఘవులు మాట్లాడుతూ.. మోదీ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం ఏపీ, తెలంగాణలో పోరాటం చేస్తామని తెలిపారు. అంతకుముందు వెటరన్ లీడర్లు, తొలి సెంట్రల్ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. వి శంకరయ్య, వీఎస్ అచ్యుతానందన్‌ను సన్మానించారు. జీవితాంతం ప్రజల కోసమే అంకితమై పనిచేసిన నాయకుల సేవలను గుర్తు చేసుకున్నారు.

సీపీఎం మహాసభలు


బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఏప్రిల్ 21 వరకు మహాసభలు కొనసాగుతాయి. అనంతరం 22న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభతో ఈ సమావేశాలు ముగుస్తాయి. ప్రధాన వేదిక ఆర్టీసీ కల్యాణ మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మహాసభలకు 16 మంది పొలిట్‌ బ్యూరో సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సీపీఎం పార్టీ అగ్ర నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.