యాప్నగరం

ఏపీలో ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలులు, ఉరుములు- మెరుపులతో కూడిన అకాల వర్షం జనసామాన్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది.

Samayam Telugu 2 May 2018, 7:47 am
ఈదురుగాలులు, ఉరుములు- మెరుపులతో కూడిన అకాల వర్షం జనసామాన్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ తరహా వాతావరణంతో తీవ్రమైన పంటనష్టం, జననష్టం జరిగింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే పిడుగుపాట్లతో ఏడుగురు మరణించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో పిడుగుపాట్లతో 12 మంది మృతి చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక పంటనష్టం కూడా తీవ్రంగా ఉంది, ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఈదురుగాలులతో రైతుల చేతికందకుండా పోయింది.
Samayam Telugu thunder


మంగళవారం మధ్యాహ్నం నుంచినే వాతావరణం మారిపోయింది. అంత వరకూ సూర్యుడు నిప్పులు కురిపించే ఎండతో చెలరేగిపోగా, అంతలోనే కారుమబ్బులు కమ్మేశాయి. మరో వైపు ఈదురుగాలులు చెలరేగిపోయాయి. వీటి తీవ్రతతో పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపడ్డాయి. పంటనష్టం అయితే వేరే చెప్పనక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈదురుగాలులకు తాటి చెట్టొకటి విరిగిపడి ఒక వ్యక్తి మరణించారు. ఈ జిల్లాలో పంటనష్టం కూడా తీవ్రంగా ఉంది. ధాన్యం ఆరబెట్టుకున్న రైతుల పరిస్థితి కూడా ధైన్యంగా మారింది.

కృష్ణా జిల్లాలో ఈదురుగాలుల ధాటికి విద్యుత్ సరఫరాలో కూడా తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల వైర్లు తెగిపోవడం, విద్యుత్ స్తంభాలు నేల కూలడం వంటి సంఘటనలతో మంగళవారం రాత్రి అనేక గ్రామాలు అంధకారంలో మునిగాయి. తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం భయకంపితులను చేసింది. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

విశాఖలో మంగళవారం ఉదయం నుంచినే భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సముద్రంపైకి చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు కూడా గల్లంతయ్యారని నగరంలోని పెదజాలరి పేటలోని స్థానికులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.