యాప్నగరం

కాకినాడ మేయర్‌గా సుంకర పావని

కాకినాడ నగర పాలక మేయర్‌గా సుంకర పావని ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కె.సత్తిబాబును ఎంపికచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈమేరకు నిర్ణయం తీసుకొని.. గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు..

TNN 16 Sep 2017, 12:19 pm
కాకినాడ నగర పాలక మేయర్‌గా సుంకర పావని ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కె.సత్తిబాబును ఎంపికచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈమేరకు నిర్ణయం తీసుకొని.. గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. మేయర్‌ అభ్యర్థి ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేసిన టీడీపీ నాయకత్వం అందరి అభిప్రాయాలను సేకరించి, తుది నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడికే వదిలేశారు. ఆయన మంత్రులు, సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సుంకర పావని పేరును ఎంపిక చేశారు.
Samayam Telugu sunkara pavani named kakinada mayor post
కాకినాడ మేయర్‌గా సుంకర పావని


ఆగస్టు 29న నిర్వహించిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి, 30 ఏళ్ల అనంతరం అక్కడ పాగా వేసిన విషయం తెలిసిందే. అయితే.. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం నాటి నుంచి అత్యంత గోప్యత పాటించారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు.. దాన్ని సీల్డు కవర్‌లో పంపించారు.

చంద్రబాబు పంపించిన సీల్డు కవర్‌ను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప శనివారం (సెప్టెంబర్ 16) ఉదయం ఓపెన్ చేసి సుంకర పావనిని మేయర్‌గా, సత్తిబాబును డిప్యూటీ మేయర్‌గా ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే వారు ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం

మేయర్ పదవికి తన ఎంపిక పట్ల హర్షం ప్రకటించిన పావని.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మేయర్ పీఠం తనకే దక్కుతుందని తొలి నుంచే విశ్వాసంతో ఉన్నానని ఆమె తెలిపారు. కాకినాడను స్మార్ట్‌సిటీగా మార్చడంలో తనవంతు కృషి చేస్తానని, నాయకుల సలహాలు, సూచనలతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా అమలయ్యేలా చూస్తానని ఆమె అన్నారు.

50 డివిజన్లు ఉన్న కాకినాడ నగర పాలక సంస్థలో 48 డివిజన్లకు ఎన్నికలు జరిగగా.. టీడీపీ 39 చోట్ల పోటీ చేసి 32 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షం బీజేపీ 9 డివిజన్లలో పోటీ చేసి 3 స్థానాల్లో గెలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.