యాప్నగరం

‘అవినీతిలో జగన్.. నటనలో పవన్ సూపర్‌స్టార్లు’

ప్రభుత్వాన్ని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ చేస్తోన్న విమర్శలపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. జగన్ తనను తాను మహనీయులతో పోల్చుకోవడం ఆయన అవివేకమని అన్నారు.

Samayam Telugu 31 Jul 2018, 8:40 am
ప్రభుత్వాన్ని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ చేస్తోన్న విమర్శలపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. జగన్ తనను తాను మహనీయులతో పోల్చుకోవడం ఆయన అవివేకమని మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, శిద్ధా రాఘవరావు వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మంత్రులు మీడియాతో మాట్లాడుతూ... అవినీతి కేసుల్లో అరెస్టయి జైల్లో గడిపిన జగన్‌ తనను తాను గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్‌ చంద్రబోస్‌లతో పోల్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆయన ఓ దోపిడీదారు, గజదొంగ అని మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. నెలకు 55 లక్షల మందికి పింఛన్లు అందజేస్తోన్న విషయం జగన్‌కు కనిపించడం లేదా అని ఆయన నిలదీశారు. పవన్‌కు ఏదో చేయాలన్న తపన ఉందని, అయితే ఏంచేయాలో ఆయనకే అర్ధం కావడంలేదని ఎద్దేవా చేశారు. అవినీతిలో సూపర్‌స్టార్‌ జగన్‌ అయితే.. నటనలో పవన్‌ సూపర్‌స్టార్‌ అని..అభివృద్ధిలో సూపర్‌స్టార్‌ చంద్రబాబు అని అయ్యన్న అన్నారు.
Samayam Telugu టీడీపీ మంత్రులు


బీజేపీ డైరక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్‌ రాజధాని అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి పుల్లారావు దుయ్యబట్టారు. అమరావతికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల మనసుల్లో పవన్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే రైతులే ఆయనపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. పాదయాత్ర ముగిసేసరికే వైసీపీ అధినేతకు మతిభ్రమించడం ఖాయమని, ప్రధానితో అంటకాగుతోన్న జగన్, పవన్‌లు ఏపీకి నమ్మకద్రోహం చేసిన మోదీని నిలదీసే ధైర్యం లేదని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, నాలుగేళ్ల టీడీపీ పాలనలో 40 సంవత్సరాల అభివృద్ధి జరిగిందని మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు.

ప్రతిపక్ష నేత అర్థంలేని మాటలకు తూర్పు గోదావరి జిల్లాలో కాపులపై చేసిన ప్రసంగమే ఉదాహరణని రవాణా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై స్పందించని జగన్‌ రూ.లక్ష కోట్లు దాచుకోవడానికి, కేసుల మాఫీకి సీఎం పదవి కోసం అర్రులు చాస్తున్నారని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.