యాప్నగరం

వీర తెలంగాణ నాది.. అని నినదించిన ప్రజాకవి కాళోజీ

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కాళోజీ.. తెలుగు పట్ల, తెలంగాణ భాష పట్ల అంతులేని ప్రేమ కనరిచారు. పండితుల భాషలో కాకుండా సామాన్యుడి భాషలో రచనలు చేశారు. జనం గోడుకు ఆయన కలం గొంతుకైంది.

Samayam Telugu 7 Dec 2022, 10:41 am
తెలుగు భాష ఒక్కటైనా, మాండలికాలెన్నో. ఆంధ్రులు మాట్లాడే విధానానికి, తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉంటుంది. తెలంగాణ యాస వినసొంపుగా ఉంటుంది. నిజాం పాలనలో ఉర్దూ ప్రాబల్యాన్ని తట్టుకొని మరీ తెలంగాణ ప్రాంతంలో తెలుగు నిలబడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక ఉర్దూ కలగలిసిన తెలంగాణ ప్రజల యాసను కొందరు గేలి చేశారు. దీన్ని తెలంగాణ కవులు తీవ్రంగా విమర్శించారు. అలాంటి వారిలో కాళోజీ నారాయణ రావు ఒకరు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన.. తెలుగు భాషపై, తెలంగాణ యాసపై ఎనలేని ప్రేమ కనబరిచారు.
Samayam Telugu kalanna
కాళోజీ


తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు
అని తెలంగాణ యాసను విమర్శించే వారికి కాళోజీ దీటుగా బదులిచ్చారు.

వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది
వేరై కూడ తెలంగాణ వీరతెలంగాణ ముమ్మటికి
తెలంగాణ వేరై నిలచి భారతాన వెలయు ముమ్మటికి
అని నినదించిన కాళోజీ 1914 సెప్టెంబర్ 9న నాటి నిజాం పాలనలోని బీజాపూర్ జిల్లా రట్టిహల్లిలో జన్మించారు. ఆయన తల్లి కన్నడిగుల ఆడపడుచు కాగా, తండ్రి మహారాష్ట్రీయుడు. చిన్నతనంలోనే ఆయన కుటుంబం వరంగల్‌లో స్థిరపడింది.

‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించారాయన.

తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా కాళోజీ పేరు గడించారు. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై ముక్కుసూటిగా స్పందించి.. పాలకులపై అక్షరాయుధాలను సంధించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహాన్ని ఆయన గేయాలు కళ్లకు కడతాయి. ప్రజాకవిగా పేరొందిన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకొంటున్నాం. సామాన్యుడి భాష, యాస ద్వారా సమస్యలపై గళం విప్పిన కాళన్న స్ఫూర్తితో తెలంగాణ ప్రజానీకం ముందుకెళ్లాలని ఆశిద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.