యాప్నగరం

క్రమబద్ధీకరించండి.. రోడ్డెక్కిన గురుకుల టీచర్లు

తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలంటూ గురుకుల టీచర్లు రోడ్డెక్కారు.

TNN 8 Nov 2017, 3:47 pm
తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలంటూ గురుకుల టీచర్లు రోడ్డెక్కారు. తమ పోస్టులను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణం నుంచి హైదరాబాద్‌లోని అసెంబ్లీ వరకు టీచర్లు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం 738 మంది కాంట్రాక్ట్ టీచర్లు హైదరాబాద్ చేరుకుని బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజ్ వద్ద సామూహిక రిలే నిరాహార దీక్షలు చేశారు.
Samayam Telugu telangana gurukula contract teachers demand regularization of posts
క్రమబద్ధీకరించండి.. రోడ్డెక్కిన గురుకుల టీచర్లు


తాజాగా బుధవారం మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అనంతరం మాసబ్ ట్యాంక్ సిగ్నల్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా గోషామహల్ స్టేడియం వద్దకు తరలించారు. తమను క్రమబద్ధీకరించాలంటూ గత 11 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు విన్నవిస్తున్న పట్టించుకోవడంలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చినా ఆచరణలోకి తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఉద్యోగులుగా గుర్తించి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి మరోసారి విన్నవిస్తున్నామన్నారు.

వాస్తవానికి గురుకుల పాఠశాలల్లో తొమ్మిదేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న 758 మంది టీచర్లు, అడ్‌హాక్ పద్ధతిలో పని చేస్తున్న 18 మంది టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ 2016లోనే నిర్ణయించారు. కానీ అది ఆచరణలోకి రాలేదు. వీరిని క్రమబద్ధీకరణ చేయకపోగా.. గురుకులాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. తమను క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.