యాప్నగరం

తెలుగు బోధించే స్కూళ్లకే అనుమతి: కేసీఆర్

తెలంగాణలోని విద్యా సంస్థల్లో తెలుగు భాషా బోధనను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

TNN 13 Sep 2017, 8:44 am
తెలంగాణలోని విద్యా సంస్థల్లో తెలుగు భాషా బోధనను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని విద్యా సంస్థలకు సూచించారు. తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే రాష్ట్రంలో అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఆ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబరులో కాకుండా డిసెంబరు 15 నుంచి 19 వరకు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
Samayam Telugu telugu should be made compulsory in all schools says telangana cm kcr
తెలుగు బోధించే స్కూళ్లకే అనుమతి: కేసీఆర్


ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని అధికారులు కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రమంతటా ఉత్సవాలను జరుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తెలుగును పరిరక్షించే కీలక నిర్ణయాలను ప్రకటించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్‌లో బోధించే తెలుగు పాఠ్యాంశానికి సంబంధించి కొత్త సిలబస్‌ రూపొందించాలని సాహిత్య అకాడమీని ఆదేశించారు. అలాగే పుస్తకాలు కూడా ముద్రించాలన్నారు.

సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా, కచ్చితంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ బోర్డులను కచ్చితంగా తెలుగులోనే రాయాలన్నారు. మొదట స్పష్టంగా తెలుగులో ఉండాలని, ఆ తర్వాత ఇతర భాషలు రాసుకోవచ్చని కేసీఆర్‌ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.