యాప్నగరం

పేపర్ లీక్ కాదు.. మాల్ ప్రాక్టీస్: చంద్రబాబు

నెల్లూరులో పదోతరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

TNN 28 Mar 2017, 5:55 pm
నెల్లూరులో పదోతరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అది పేపర్ లీక్ కాదని, మాల్ ప్రాక్టీస్ అని స్పష్టం చేశారు. పదోతరగతి ప్రశ్నపత్రం లీక్ అంశంపై చర్చకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా జగన్ సహా కొంతమంది వైకాపా నేతలు సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ.. నెల్లూరులోని ఓ పరీక్ష కేంద్రం నుంచి వాట్సాప్ ద్వారా సైన్స్ పేపర్ బయటికి వచ్చినట్లు గుర్తించామని అన్నారు.
Samayam Telugu this is not a paper leak mall practice only says cm chandrababu
పేపర్ లీక్ కాదు.. మాల్ ప్రాక్టీస్: చంద్రబాబు


అయితే సాక్షి రిపోర్టర్ ఫోన్ నంబర్ ద్వారానే ఈ పేపర్ బయటకు వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. ‘ఈనెల 25న నెల్లూరులోని నారాయణ స్కూల్‌లో పేపర్ లీకైనట్లు ఉదయం 10.35 గంటలకు సాక్షి రిపోర్టర్ డీఈవోకి ఎస్ఎంఎస్ పంపారు. అసలు లీకైనట్టు చెబుతున్న పేపర్ సాక్షి రిపోర్టర్‌కే ఎందుకు వచ్చింది? నాలుగు రోజుల కిందట బయటకు వచ్చినట్టు చెబుతున్న ఈ పేపర్ అంశాన్ని వైకాపా ఇప్పటివరకు ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

పిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. పిల్లల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే కఠినంగా ఉంటామని విపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పేపర్ లీకైనట్టు చెబుతున్న సెంటర్లో నారాయణ పాఠశాల విద్యార్థులే లేరని, అలాంటప్పుడు ఆ పాఠశాలపై ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారని మండిపడ్డారు. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను కొందరిని విధుల నుంచి తొలగించామని, అరెస్టుకు ఆదేశాలిచ్చామని చంద్రబాబు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.