యాప్నగరం

తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

తెలంగాణలో ఉభయసభల సమావేశం నేపథ్యంలో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు వేశారు.

Samayam Telugu 16 Jan 2019, 5:09 pm
తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, రాములు నాయక్‌, యాదవ రెడ్డిని అనర్హులుగా ప్రకటిస్తూ మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ బుధవారం (జనవరి 16) కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరంతా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శనివారం (జనవరి 19) ఉభయ సభలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలి ఛైర్మన్‌ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది.
Samayam Telugu council


నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి భూపతి రెడ్డి, శాసనసభ్యుల కోటాలో యాదవ రెడ్డి, గవర్నర్‌ కోటాలో రాములు నాయక్‌ మండలిలో సభ్యులుగా ఉన్నారు. అయితే.. టీఆర్‌ఎస్ సభ్యులుగా ఎన్నికైన ఈ ముగ్గురూ కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని టీఆర్‌ఎస్ శాసనమండలి పక్షం ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని కోరింది.

ఈ నేపథ్యంలో శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్ ఇటీవల ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తాజాగా నిర్ణయం ప్రకటించారు. తమ పార్టీ నుంచి గెలిచి చట్ట విరుద్ధంగా పార్టీ మారారని వాదించిన టీఆర్‌ఎస్.. దానికి సంబంధించిన ఆధారాలను మండలి ఛైర్మన్‌కు సమర్పించింది. పరిశీలించిన ఛైర్మన్ వీరిపై చర్యలు చేపట్టారు. భూపతి రెడ్డి, రాములు నాయక్‌, యాదవ రెడ్డిపై అనర్హత వేటు వేస్తూ తుది నిర్ణయాన్ని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.