యాప్నగరం

నేడు టీడీపీ సైకిల్ యాత్ర.. జనసేన పాదయాత్ర!

ఏపీకి జరిగిన అన్యాయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీగా ఉద్యమాలు చేస్తున్నాయి. పార్లమెంటులో టీడీపీ, వైసీపీలు వేర్వేరుగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

Samayam Telugu 6 Apr 2018, 7:51 am
ఏపీకి జరిగిన అన్యాయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీగా ఉద్యమాలు చేస్తున్నాయి. పార్లమెంటులో టీడీపీ, వైసీపీలు వేర్వేరుగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం సైకిల్‌, మోటార్‌ సైకిల్‌ యాత్రలను టీడీపీ నిర్వహిస్తుండగా, జనసేనాని పాదయాత్ర నిర్వహిస్తారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ ఎమ్మెల్యేలంతా సైకిళ్లపై వెళ్లి ఈ యాత్రలో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆయన కూడా ఎమ్మెల్యేలతో కలిసి సైకిల్‌పై శాసనసభకు చేరుకుంటారు. సీఎం నివాసంలో గురువారం తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ వ్యూహ కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.
Samayam Telugu టీడీపీ- జనసేన


దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలు కోసం పార్లమెంటు వేదికగా పోరాటం సాగించిన ఎంపీలంతా ఆత్మగౌరవ యాత్ర పేరుతో 13 జిల్లాల్లో బస్సు యాత్ర చేపడతారని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం ఎంపీలతో శనివారం సమావేశమై ఈ యాత్ర విధివిధానాలు, ఆయా జిల్లాల పర్యటన తేదీలను సీఎం చంద్రబాబు ఖరారు చేస్తారు.

మరోవైపు ప్రత్యేక హోదా, విభజనచట్టంలో హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం, సీపీఐలతో కలిసి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ జాతీయ రహదారులపై పాదయాత్రను నిర్వహించనున్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు సీపీఎం, సీపీఐ నాయకులతో కలిసి పవన్‌ కల్యాణ్‌ ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు. ఏలూరు రోడ్‌ మీదుగా రామవరప్పాడు రింగ్‌ వరకూ ఈ యాత్ర సాగుతుంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వామపక్షాలు, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు జాతీయ రహదారులపై పాదయాత్రను చేపడతారు. ప్రజలందరూ ఈ ఆందోళనలో పాల్గొనాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపు ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.