యాప్నగరం

కామ్రేడ్ హరిభూషణ్.. ఇంజినీరింగ్ నుంచి అరణ్యం వైపు

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ మరణించారు.

TNN 2 Mar 2018, 1:57 pm
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 10 మంది చనిపోగా వారిలో హరిభూషణ్ కూడా ఉన్నారు. హరిభూషణ్ అసలు పేరు వేప నారాయణ. మావోయిస్టు పార్టీలో చేరిన తరవాత హరిభూషణ్ అలియాస్ జగన్‌గా మారారు. ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా కొత్తగూడ మండలంలోని మర్రిగూడెం. ఇంజినీరింగ్ వరకు చదివిన హరిభూషణ్.. విప్లవం వైపు అడుగులు వేసి అరణ్యం బాట పట్టారు. ఇంజినీరింగ్ చదుతున్నప్పుడు అప్పటి రాడికల్స్ స్టూడెంట్ యూనియన్‌లో కీలక నేతగా ఉంటూ అజ్ఞాత బాట పట్టారు.
Samayam Telugu top maoist leader hari bhushan killed in encounter
కామ్రేడ్ హరిభూషణ్.. ఇంజినీరింగ్ నుంచి అరణ్యం వైపు


హరిభూషణ్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కేంద్ర ప్లాటిస్ కమాండెంట్, తెలంగాణ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సాంకేతిక విద్యను అభ్యసించిన హరిభూషణ్.. మొబైల్ దాడులు ఎలా చెయ్యాలో పలు రాష్ట్రాల్లోని మావోయిస్టులకు శిక్షణనిచ్చేవారని సమాచారం. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ప్రతి దాడిలో హరిభూషణ్ హస్తముందని పోలీసులు అంటున్నారు. 30 ఏళ్ల నుంచి మావోయిస్టు ఉద్యమాల్లో పాలుపంచుకుంటున్న హరిభూషణ్‌పై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో వందలాది కేసులున్నాయని తెలుస్తోంది. ఆయనపై రూ.30 లక్షల నగదు రివార్డు కూడా ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా హరిభూషణ్‌ నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన ఉత్తర తెలంగాణలోని కెకెడబ్ల్యు(ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌) డివిజన్‌లో కార్యకలాపాలను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్ చనిపోవడంతో మావోయిస్టులకు గట్టి దెబ్బే తగిలినట్లయింది. ఈ ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్ భార్య సమ్మక్క కూడా చనిపోయినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.