యాప్నగరం

ఎన్‌కౌంటర్ మృతుల్లో మావోయిస్ట్ కీలక నేతలు

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.

TNN 2 Mar 2018, 1:55 pm
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ అలియాస్ జగన్ ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. అలాగే మరో కీలక నేత బడే చొక్కారావు కూడా మరణించినట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం సరిహద్దులోని తడపల గుట్ట, పూజారీ కాంకేడ్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మొత్తం 10 మంది మావోయిస్టులు నేలకొరగగా.. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.
Samayam Telugu top maoist leaders killed in telangana encounter
ఎన్‌కౌంటర్ మృతుల్లో మావోయిస్ట్ కీలక నేతలు


అలాగే మృతి చెందిన మావోయిస్టుల్లో ఖమ్మం జిల్లా కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, సెంట్రల్ రెవల్యూషనరీ కమిటీ కార్యదర్శి సాగర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హరిభూషణ్ భార్య సమ్మక్క కూడా మరణించారని అంటున్నారు. విరసం నేత వరవరరావు సైతం ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్ భార్య చనిపోయారని తెలిసిందని మీడియాతో అన్నారు.

మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రేహౌండ్స్ కమాండో సుశీల్ కుమార్ ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు చికిత్స పొందుతున్నారు. వికారాబాద్‌కు చెందిన సుశీల్ 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. కాగా, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలను హెలీకాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు ఏకే 47 గన్స్‌తో పాటు స్కానర్, ల్యాప్‌టాప్, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.