యాప్నగరం

హైదరాబాద్‌లో ఉబర్, ఓలా సేవలు బంద్

హైదరాబాద్‌లో ఉబర్, ఓలా క్యాబ్ సేవలు నిలిచిపోయాయి.

TNN 23 Oct 2017, 12:21 pm
హైదరాబాద్‌లో ఉబర్, ఓలా క్యాబ్ సేవలు సోమవారం నిలిచిపోయాయి. ఫైనాన్షియర్ల వేధింపులు, డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో సోమవారం ఉబర్, ఓలా క్యాబ్‌ల సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. క్యాబ్ డ్రైవర్ల కష్టాన్ని ఈ రెండు సంస్థలు దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ వద్ద క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో ప్రభుత్వం కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Samayam Telugu uber ola cab owners and drivers go on strike in hyderabad
హైదరాబాద్‌లో ఉబర్, ఓలా సేవలు బంద్


హైదరాబాద్ నగరంలో క్యాబ్‌ల వినియోగం పెరగడంతో ఉబర్, ఓలా సంస్థలు తమ సేవలను మరింత విస్తరించాయి. కేవలం రూ.30వేల డౌన్ పేమెంట్ చెల్లించి కారును మీ సొంతం చేసుకోవచ్చని, నెలకు రూ.70వేలు సంపాదించొచ్చని డ్రైవర్లకు ఆశ జూపాయి. దీంతో నగరంలోని కొన్ని వందల మంది డ్రైవర్లు ఉబర్, ఓలా సంస్థల్లో చేరి ఓనర్లుగా మారారు. అయితే తమకు రావాల్సిన నెలసరి మొత్తాన్ని ఫైనాన్స్, మెయంటెనెన్స్ రూపంలో ఈ రెండు సంస్థలు కాజేస్తున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. నెలకు రూ.70 వేలు అని చెప్పి.. ఇప్పుడు అన్నీ పోను రూ.15వేలు ముట్టచెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో క్యాబ్ బిజినెస్ చాలా బాగుందని ప్రచారం జరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల నుంచి నగరానికి వచ్చిన డ్రైవర్లు సొంతంగా కార్లు కొనుకుని ఓలా, ఉబర్‌లో చేరారు. ఇప్పుడు వీళ్లలో చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వేడుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టేంతవరకు క్యాబ్‌ల బంద్‌ను కొనసాగిస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.