యాప్నగరం

విజయవాడ: అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా అమ్మాయిలో కదలిక!

విజయవాడలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బాలిక బతికుండగానే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా.. బాలికలో కదలికను గమనించారు.

TNN 30 Dec 2017, 8:46 pm
విజయవాడలో విషాదకర ఉదంతం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బాలిక బతికుండగానే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విషాద వదనాలతో బాలికను ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా.. ఊపిరి తీసుకున్నట్లు కదలికను గమనించారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధిత కుటుంబం బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజరాజేశ్వరిపేటకు చెందిన పి. సాయిదుర్గ (12) గత ఆదివారం (డిసెంబర్ 24) అస్వస్థతకు గురైంది. స్థానిక ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. బాలిక బాగా నీరసించిందని, మెరుగైన చికిత్స కోసం మంచి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. నిరుపేద కుటుంబం కావడంతో సాయిదుర్గను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
Samayam Telugu vijayawada declared dead by doctors girl comes alive at crematorium
విజయవాడ: అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా అమ్మాయిలో కదలిక!


ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిదుర్గ మరణించిందని వైద్యులు శుక్రవారం (డిసెంబర్ 29) రాత్రి ధ్రువీకరించారు. బాలికను ఇంటికి తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు తెలిపారు. రాత్రి 11 గంటల సమయంలో సాయిదుర్గను అంబులెన్స్‌లో ఇంటికి తరలించారు.

శనివారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సాయిదుర్గ కదిలినట్లు బంధువులు గుర్తించారు. స్థానిక వైద్యురాలు బాలికను పరిశీలించి, గుండె కొట్టుకుంటుందని చెప్పడంతో.. వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోమా స్థితిలోకి వెళ్లిపోయిన సాయిదుర్గ ప్రస్తుతం పాయకరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

దుర్గ తండ్రి శ్రీను స్థానికంగా చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవాడు. కుటుంబ కలహాలతో ఇటీవలే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిరుపేదల పట్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల వ్యవహార తీరు దారుణమని బాలిక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయిదుర్గ బతికుండానే చనిపోయిందని మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చారని మండిపడుతున్నారు.

ప్రభుత్వ వైద్యులు సరైన చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేశారని, దీంతో సాయిదుర్గ ఆరోగ్యం మరింత క్షీణించిందని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రాణం పోయాల్సిన వైద్యులే ఇలా చేస్తే.. ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వకుండా వెళ్లిపోయాడని వారు మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.