యాప్నగరం

విక్రమ్ గౌడ్ అలా ప్లాన్ చేశాడని తెలీదు: షిఫాలి

మాజీ మంత్రి తనయుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల కేసులో చివరకు తాము అనుమానించిందే నిజమైంది...

TNN 1 Aug 2017, 11:08 pm
మాజీ మంత్రి తనయుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల కేసులో చివరకు తాము అనుమానించిందే నిజమైంది అంటున్నారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇండోర్‌కి చెందిన షార్ప్ షూటర్ నందుతో విక్రమ్ గౌడ్ ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఈ కాల్పులు జరిగాయని తమ విచారణలో వెల్లడైందని పోలీసులు స్పష్టంచేశారు. దీంతో విక్రమ్ గౌడ్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఆయుధాల చట్టంతోపాటు పోలీసులని తప్పుదోవ పట్టించడం వంటి పలు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఏ1 గా విక్రమ్ గౌడ్, నందుని ఏ2గా, వీరికి సహకరించిన అహ్మద్ ఖాన్ అనే వ్యక్తిని ఏ3గా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఏర్పాటు చేయనున్న ప్రెస్ మీట్‌లో వెల్లడించనున్నట్టు పోలీసులు స్పష్టంచేశారు.
Samayam Telugu vikram gouds wife shipalis version about agreement with sharp shooter nandu
విక్రమ్ గౌడ్ అలా ప్లాన్ చేశాడని తెలీదు: షిఫాలి


ఇదిలావుంటే, విక్రమ్ గౌడ్ తనపైనే హత్యాయత్నం జరిగే విధంగా తనకి తానే ఓ డ్రామాని ప్లాన్ చేసుకున్నాడని తెలియదు అంటున్నారు విక్రమ్ గౌడ్ భార్య షిఫాలి. పోలీసులు చూపించిన నందు ఫోటోని చూసిన షిఫాలి... '' కాల్పుల ఘటన జరగడానికి సరిగ్గా మూడు రోజుల ముందే విక్రమ్ గౌడ్ ఫోటోలో వున్న నందు అనే వ్యక్తికి తమ ఇంట్లోనే విందు పార్టీ ఇచ్చారు" అని చెప్పినట్టు తెలుస్తోంది. 'నందుకి పార్టీ ఇచ్చిన విక్రమ్ గౌడ్ అతడితో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్నాడనే విషయం మాత్రం తనకి తెలియదు' అని షిఫాలి పోలీసులకి చెప్పినట్టు సమాచారం.

విక్రమ్ గౌడ్ ఇలా చేస్తాడని తాము ఊహించలేదని షిఫాలి, ఆమె సోదరుడు (విక్రమ్ గౌడ్ బావమరిది) సైతం ఈ ఘటనపై విస్మయం వ్యక్తంచేశారని చెబుతున్న పోలీసులు... ఈ కాల్పుల కుట్రలో షిఫాలి పాత్ర లేదని భావిస్తున్నామని అన్నారు. ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతం ముగ్గురు నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు విక్రమ్ గౌడ్ కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అతడిని కూడా అరెస్ట్ చేయనున్నట్టు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.