యాప్నగరం

దుర్గమ్మకు తాంత్రిక పూజలు నిజమే.. విస్తుపోయిన బాబు!

గత డిసెంబరు 26 అర్థరాత్రి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో విమర్శలు వెలువెత్తిన విషయం తెలిసిందే.

TNN 7 Jan 2018, 8:40 am
గత డిసెంబరు 26 అర్థరాత్రి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో విమర్శలు వెలువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం స్పందించిన విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు అమ్మవారి గుడిలో ఆ రోజు అర్థరాత్రి ఏం జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. డిసెంబరు 26 అర్థరాత్రి బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగిన మాట వాస్తవమేనని, తాంత్రిక శక్తులను నిద్రలేపేందుకు ప్రత్యేక పూజలు, మహిషాసుర మర్దిని అలంకరణ కూడా చేశారని పోలీసులు దర్యాప్తులో తేలింది. అంతేకాదు ఇదంతా ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు నిర్థరించారు. ఈ ఘటన వెనుక ఈఓ సూర్యకుమారి ప్రమేయం ఉందని గుర్తించారు.
Samayam Telugu was tantric ritual conducted at vijayawadas kanaka durga temple
దుర్గమ్మకు తాంత్రిక పూజలు నిజమే.. విస్తుపోయిన బాబు!


దుర్గగుడిలో అర్ధరాత్రి పూజలపై నిజనిర్ధరణ కమిటీతోపాటు పోలీసులు కూడా సమాంతరంగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. డీసీపీ కాంతి రాణా టాటా నేతృత్వంలోని విచారణ బృందం 20 మందిని విచారించగా వారిలో ముగ్గురు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అంగీకరించారు. ఈ దర్యాప్తు తర్వాత నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అధికారులు సమర్పించారు. అమ్మవారికి అపచారం జరిగినట్లు తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పూర్తిస్థాయి పాలనా వైఫల్యమేనని, ఇంత జరుగుతుంటే అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని ఇతర దేవాలయాల్లో ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయా? అన్న విషయాన్ని తేల్చాలని ఆదేశించారు.

ఈ పూజల కోసం తమను ముందురోజు పిలిపించారని విశ్వనాథపల్లి శివాలయానికి చెందిన పూజారి పార్థసారధి విచారణలో వెల్లడించాడు. డిసెంబర్ 26 రాత్రి అమ్మవారి కవచాన్ని తొలగించి మహిషాసుర మర్దినిగా అలంకరించి పూజలు నిర్వహించామని, అటుపిమ్మట సాధారణ అలంకరించినట్లు ఆయన చెప్పాడు. అయితే, అలంకరణ కుదరకపోవడంతో, మర్నాడు ఉదయం 9 గంటల తరువాత దర్శనం నిలిపివేసి, సరిచేశామని సుజన్ అనే పూజారి వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.

అయితే ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బాబు మాత్రం తాము అలంకరణ చేశామే తప్ప పూజలు చేయలేదని వెల్లడించాడని, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన తరువాత క్యూలైన్ ఇన్‌స్పెక్టర్ మధు కూడా కనిపించగా, అతడిని విచారించామని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఆ సమయంలో తమను బయటకు పంపారని, బయటే ఉన్న కారణంగా లోపల ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పినట్లు తెలియజేశారు. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను విచారించగా, బద్రీనాథ్‌తోపాటు ఇతర అర్చకులు రాత్రి 12.30 తరువాత వెళ్లారని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.