యాప్నగరం

కాక పెంచుతున్న కాంగ్రెస్ ‘వస్త్రాభరణం’.. ప్రియాంకతో ఇలా చేస్తారా..?

కాంగ్రెస్ పార్టీ వదిలిన ద్రౌపది వస్త్రాభరణం కార్టూన్ తెలంగాణలో రాజకీయ వేడి రాజేస్తోంది. మహాభారతంలోని వస్త్రాభరణాన్ని తలపించేలా రూపొందించిన ఈ కార్టూన్‌ విమర్శలకు తావిస్తోంది.

Samayam Telugu 25 Jan 2019, 5:27 pm
కాంగ్రెస్ పార్టీ వదిలిన ద్రౌపది వస్త్రాభరణం కార్టూన్ తెలంగాణలో రాజకీయ వేడి రాజేస్తోంది. మహాభారతంలోని వస్త్రాభరణాన్ని తలపించేలా రూపొందించిన ఈ కార్టూన్‌లో ఎన్నికల సంఘాన్ని దుశ్శాసనుడిగా పేర్కొన్న కాంగ్రెస్.. ఓటర్లను ద్రౌపదిగా అభివర్ణించింది. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ కార్టూన్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం విఫలమైందని చెప్పడమే ఈ కార్టూన్ ఉద్దేశం.
Samayam Telugu congress cartoon


కేసీఆర్, ఓవైసీలు చూస్తుండగా.. వస్త్రాభరణం జరుగుతున్నట్టుగా రూపొందించిన ఈ కార్టూన్ రాజకీయంగా దుమరం రేపుతోంది. హిందువుల మనోభావాలను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఈ కార్టూన్‌ను ప్రియాంక గాంధీ అంగీకరిస్తారా..? అని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కిషన్ సాగర్ రావు ప్రశ్నించారు.

కాంగ్రెస్ కార్టూన్ పట్ల అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. నిరసన చేపట్టే హక్కు అందరికీ ఉందన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ద్రౌపదిని పోస్టర్లలో వాడటం తప్పన్నారు. ఇంకెవరైనా సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలతో ఈ తరహా కార్టున్లు గీస్తే మీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది. సోనియా గాంధీని నేనెంతో గౌరవిస్తాను. కాంగ్రెస్ తన హక్కుల కోసం పోరాడొచ్చు. కానీ ఇలా మహిళలను అవమానించేలా మాత్రం కాదని ఓవైసీ హితవు పలికారు.

ఈ పోస్టర్లలో తప్పేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చీఫ్ మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పోస్టర్ బాధ్యత పూర్తిగా నాదేనన్న ఆయన.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ కార్టూన్ లేదని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా నీరుగారుతుందో చెప్పడమే తమ ఉద్దేశమన్నారు. ఎన్నికల సంఘం తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.