యాప్నగరం

తిరుపతి: రైలు కింద పడి భర్త.. అదే దారిలో భార్య

రిటైర్డు జడ్జి ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా.. ఆయన భార్య కూడా అదే రీతిలో తనువు చాలించారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాధాన్ని నింపింది.

Samayam Telugu 6 Oct 2018, 9:10 pm
పెళ్లి నాటి ప్రమాణాన్ని తప్పొద్దనుకుందేమో ఆ ఇల్లాలు.. మరణంలోనూ భర్త దారిలోనే నడిచింది. భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా.. ఆమె కూడా అదే రీతిలో ప్రాణాలు తీసుకుంది. తిరుపతిలో జరిగిన ఈ విషాదం సంచలనంగా మారింది. తిరుపతి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పామూరు సుధాకర్‌ (65) అనే రిటైర్డ్ జడ్జి తన భార్య వరలక్ష్మి (56)తో కలిసి తిరుచానూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.
Samayam Telugu track


మహబూబ్‌నగర్‌లో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తూ సుధాకర్ 2014లో రిటైరయ్యారు. నాటి నుంచి తిరుచానూరులో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయణ్ని అనారోగ్యం వేధిస్తోంది. కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న సుధాకర్ తీవ్ర మనోవేదన పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం (అక్టోబర్ 5) ఉదయం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు.

ఉదయం 11 గంటల సమయంలో చదలవాడ విద్యాసంస్థల సమీపంలో రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

‘నా చావుకు కారణం అనారోగ్యమే.. ఎవరూ కారణం కాదు’ అంటూ ఆత్మహత్యకు ముందు సుధాకర్ తన ఇంట్లో సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి వెళ్లిపోయారు. సుధాకర్, వరలక్ష్మి దంపతులకు కుమారుడు సందీప్, కుమార్తె అజిత ఉన్నారు. వివాహమైన వీరు ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నారు.

తండ్రి మరణవార్త విన్న సందీప్, అజిత తన తల్లితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ సుధాకర్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు..

భర్త ఆత్మహత్యతో వరలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కుటుంబ సభ్యుల దృష్టి మళ్లించి శుక్రవారం సాయంత్రం అదే ప్రదేశంలో మరో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఆమెను సుధాకర్‌ భార్యగా గుర్తించారు.

తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో సందీప్, అజిత కన్నీరుమున్నీరుగా రోదించారు. వరలక్ష్మి మరణంలోనూ తన భర్త అడుగుజాడల్లో నడవడం బంధుమిత్రులు, స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ జంట ఆత్మహత్యలతో తిరుపతిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.