యాప్నగరం

BEST Thermal Battery: థర్మల్ బ్యాటరీ గొప్ప ఆవిష్కరణ చంద్రబాబు

ప్రపంచంలోనే అధిక విద్యుత్ సాంద్రత కలిగిన మొట్టమొదటి థర్మల్ బ్యాటరీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతిలో ఆవిష్కరించారు.

Samayam Telugu 6 Aug 2018, 3:44 pm
ప్రపంచంలోనే అధిక విద్యుత్ సాంద్రత కలిగిన మొట్టమొదటి థర్మల్ బ్యాటరీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతిలో ఆవిష్కరించారు. భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (బెస్ట్) తయారుచేసిన ఈ థర్మల్ బ్యాటరీని అమరావతిలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది చాలా ఆసక్తికరమైన ప్రయోగమని చెప్పారు. విద్యుత్ శక్తిని ఎలా నిల్వ చేయాలనే అంశంపై ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయని, ఈ ప్రయోగాన్ని సఫలీకృతం చేసిన బెస్ట్ సంస్థకు అభినందనలని చంద్రబాబు అన్నారు. ఇదో గొప్ప ఆవిష్కరణ అని కొనియాడారు.
Samayam Telugu Chandra


చాలా తక్కువ సమయంలో బెస్ట్ ఈ థర్మల్ బ్యాటరీని తయారుచేసిందని, దీనికి ఐఐటీ రూర్కీ ఆమోదం కూడా లభించిందని సీఎం చెప్పారు. 1997-98లో దేశంలోనే తొలిసారిగా విద్యుత్ రంగంలో తాను సంస్కరణలు తీసుకొచ్చానని చంద్రబాబు గుర్తుచేశారు. దీని మూలంగా ప్రస్తుతం రాష్ట్రానికి సరిపడేంత విద్యుత్‌ను తయారుచేసుకోగలుగుతున్నామని, విద్యుత్ కొరతను పూడ్చుకోగలిగామని చెప్పారు. తాజాగా తాను మరో విద్యుత్ సంస్కరణను ప్రకటించానని, ఇది రెండో దశ సంస్కరణ అని వెల్లడించారు. దీనిలో భాగంగా సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి విద్యుత్‌ను నిల్వ చేసే వ్యవస్థను తయారుచేయాలని సూచించానన్నారు. దీని వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని సీఎం చెప్పారు. భవిష్యత్తులో ఈ సంస్కరణలు కచ్చితంగా అమల్లోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పవన, సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. వీటి వల్ల కాలుష్యం కూడా ఉండదన్నారు. ముఖ్యంగా సౌర విద్యుత్ భారతదేశానికి ఒక వరమన్నారు. సూర్య శక్తి మనకు అధికం కాబట్టి సౌర విద్యుత్‌లో మరే దేశం భారత్‌తో పోటీ పడలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విండ్, సోలార్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ దాన్ని నిల్వ చేయడం పెద్ద సమస్యగా మారిందన్నారు. దీన్ని భారత్ భవిష్యత్తులో అధిగమించబోతోందని చెప్పారు. బెస్ట్ సంస్థ తయారుచేసే థర్మల్ బ్యాటరీతో ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి బెస్ట్ సంస్థకు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.