యాప్నగరం

సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. జగన్ సర్కారుకి ఫిచ్ హెచ్చరిక

TDP హయాంలో జరిగిన పీపీఏలను పునసమీక్షిస్తామని జగన్ సర్కారు తేల్చి చెప్పింది. ఇప్పటికే కేంద్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తాజాగా రేటింగ్ సంస్థ ఫిచ్ కూడా అలా చేయొద్దని హెచ్చరించింది.

Samayam Telugu 17 Jul 2019, 11:55 pm
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) అవకతవకలు జరిగాయని జగన్ సర్కారు బలంగా భావిస్తోంది. దీంతో ఈ పీపీఏలను పునః సమీక్షించాలని నిర్ణయించింది. ఇందుకోసం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పీపీఏలను సమీక్షిస్తే.. దాని ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని కేంద్రం హెచ్చరిస్తోన్నా.. జగన్ సర్కారు మాత్రం వాటిని సమీక్షించి తీరుతామని చెబుతోంది. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ జగన్‌కు లేఖ రాసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు.
Samayam Telugu ys jagan as cm1


తాజాగా కార్పొరేట్ రేటింగ్ సంస్థ ఫిచ్ కూడా పీపీఏ సమీక్ష విషయమై స్పందించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఫిచ్ హెచ్చరించింది. సోలార్, విండ్ పవర్ పర్చేజ్ ఒప్పందాలను సమీక్షించేందుకు ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు నగదు ప్రవాహానికి ఇబ్బందులు కలిగిస్తాయని ఫిచ్‌ అభిప్రాయపడింది.

ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ సంస్థలతోపాటు కేంద్రం నుంచి తీవ్ర సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిచ్ హెచ్చరించింది. జగన్ సర్కారు పీపీఎలను విజయవంతంగా సమీక్షించినప్పటికీ.. రిస్క్ తప్పదని ఫిచ్ తెలిపింది. పీపీఏలను రద్దు చేయడం, కొత్తగా ఒప్పందాలు చేసుకోవడం లాంటి చర్యల కారణంగా చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేసింది. గతంలో కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు పీపీఏలను సమీక్షించేందుకు ప్రయత్నించాయి. కానీ అలా చేయొద్దని కేంద్రం హెచ్చరించడంతో ఆగిపోయాయి.

ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా ఏపీ బాటలో పయనిస్తే.. పెట్టుబడులపై దాని ప్రభావం ఉంటుందని ఫిచ్ హెచ్చరించింది. ఇది పునరుత్పాదక విద్యుత్ రంగం పురోగతిపై ప్రభావం చూపుతుందని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.