యాప్నగరం

జగన్‌పై దాడికేసు.. రాజ్‌నాథ్‌కు వైసీపీ ఫిర్యాదు

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన వైసీపీ నేతలు.. వైఎస్ జగన్‌పై దాడి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని విజ్ఞ‌ప్తి..

Samayam Telugu 29 Oct 2018, 11:35 am
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిని వైసీపీ సీరియస్‌గా తీసుకుంది. ఏపీ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదంటూ.. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు డిమాండ్ చేస్తోంది. ఈ దాడి వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిస్పక్షపాత దర్యాప్తు చేయాలంటోంది. ఈ మేరకు సోమవారం వైసీపీ నేతల బృందం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసింది. వైఎస్ జగన్‌పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అలాగే తిత్లీ బాధితులకు సాయం అందించాలని కోరారు.
Samayam Telugu Ycp


రాజ్‌నాథ్‌తో భేటీ తర్వాత వైసీపీ నేతలు మాట్లాడారు. వైఎస్ జగన్‌పై దాడి ఘటనను హోంమంత్రికి వివరించామన్నారు నేతలు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే.. చిన్నదిగా చూపించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు, డీజీపీ స్పందించిన తీరు సరిగా లేదని.. ఈ విషయాన్ని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమయ్యిందని ఫిర్యాదు చేశామన్నారు.వైఎస్ జగన్‌కు కేంద్రం భద్రత కల్పించాలని విజ్ఞ‌ప్తి చేశామన్నారు వైసీపీ నేతలు. అలాగే ఆపరేషన్ గరుడ వెనుక ఎవరున్నారో విచారణ జరిపించాలని కోరామన్నారు.

చంద్రబాబు తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారేమో అనుమానం ఉందన్నారు విజయసాయి. అలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. చంద్రబాబు జీవితమంతా నేర చరిత్రేనని.. జగన్‌పై దాడి చేసిన నిందితుడ్ని వైసీపీ అభిమానిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాము రాష్ట్రపతి పాలన కోరలేదు కాని.. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మాత్రం అడిగామన్నారు. తమ విజ్ఞ‌ప్తిపై రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.