యాప్నగరం

హోదా ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష: జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Samayam Telugu 2 Apr 2018, 4:02 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర నాన్చుడు ధోరణిని నిరసిస్తూ జగన్ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. యువత ఉద్యోగ అవకాశాలకు ప్రత్యేక హోదా ప్రతీక అని పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులంతా వారి యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఆందోళనకు దిగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాస్థాయిల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతారు’ అని తన ట్వీట్‌లో జగన్ పేర్కొన్నారు.
Samayam Telugu YS_Jagan

‘ప్రత్యేక హోదా మా హక్కు. హోదా ఇవ్వకపోతే పార్లమెంటు నిరవధిక వాయిదా వెంటనే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి.. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు. ఏపీ ప్రయోజనాలు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబునాయుడు కూడా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది’ అని మరో ట్వీట్‌లో వైఎస్ జగన్ తెలిపారు.
కాగా, మార్చి 5న ప్రారంభమైన రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6తో ముగియనున్నాయి. ఏప్రిల్ 6 నుంచి పార్లమెంట్ నివరధిక వాయిదా పడనుంది. ఈ లోపల ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారు. వాస్తవానికి పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నాలుగు రోజుల్లో కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం కలే. దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీ ఎంపీలు కచ్చితంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగడం ఖాయం. మరి ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.