యాప్నగరం

73 రోజులు.. రూ. 71 లక్షలు.. స్వైన్ ఫ్లూ చంపేసింది

స్వైన్ ఫ్లూ వ్యాధితో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. 73 రోజులపాటు వ్యాధితో పోరాడిన అతడు.. భారీగా ఖర్చు పెట్టినప్పటికీ..

TNN 4 Sep 2017, 1:00 pm
ముంబై: స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడితే చేతి చమురు వదలడంతోపాటు ప్రాణాలు కూడా దక్కకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. చెంబూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఉదంతమే ఇందుకు నిదర్శనం. 42 ఏళ్ల సదరు వ్యక్తి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిజలైర్స్‌లో ఉద్యోగం చేసేవాడు. అతడికి స్వైన్ ఫ్లూ సోకడంతో 73 రోజులపాటు హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించారు. అతడు పని చేసే సంస్థ రూ. 71 లక్షలు ఖర్చు పెట్టి చికిత్స అందించింది. కానీ ప్రాణాలు మాత్రం దక్కలేదు. హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సోకడంతో ముందుగా అతణ్ని చెంబూరులోని శుశ్రుత్ హాస్పిటల్లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు, చలి ఎక్కువ కావడంతో జూన్ 19న జస్లోక్ హాస్పిటల్‌కు తరలించారు. వ్యాధి బాగా ముదరడంతో అతడు దగ్గినప్పుడు రక్తం వచ్చేది.
Samayam Telugu 73 days in hospital and rs 71 lakh later man dies of h1n1
73 రోజులు.. రూ. 71 లక్షలు.. స్వైన్ ఫ్లూ చంపేసింది


వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా అతడి శరీరం స్పందించలేదు. దీంతో ఈసీఎం మెషీన్ ద్వారా 65 రోజులపాటు కృతిమంగా శ్వాస అందించారు. ఊపిరితిత్తులతో సంబంధం లేకుండా ఈ యంత్రమే అతడికి శ్వాసను అందించడం కోసం రోజుకు రూ. 35 వేల నుంచి రూ. 45 వేల వరకూ ఖర్చు చేశారు. ముంబైలోని కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అతడిని పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా నర్సును కేటాయించారు. పెషెంట్ ఏమైనా కోలుకుంటున్నాడా? అంతర్గతంగా రక్తస్రావం జరుగుతోందా అని తెలుసుకోవడం కోసం రకరకాల పరీక్షలు నిర్వహించారు. కానీ పరిస్థితి విషమించడతో అతడు ప్రాణాలు వదిలాడు. అతడి మరణంతో హెచ్1ఎన్1 వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 488కి చేరింది. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరిగితే చికిత్సకు అయ్యే ఖర్చు భారీగా పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చలిపెట్టడం, ఆయాసం అనేవి హెచ్1ఎన్1 వైరస్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు. మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందేలా చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.