యాప్నగరం

రోజుకో కప్పు టీ తాగేవారికి వెరీ గుడ్ న్యూస్!

మీరు టీ తాగడాన్ని ఆస్వాదిస్తారా? కప్పు టీ తాగనిదే తెల్లవారదా? మీకో గుడ్ న్యూస్. రోజుకు ఒక కప్పు టీ తాగే వారిలో..

TNN 17 Mar 2017, 7:19 pm
మీరు టీ తాగడాన్ని ఆస్వాదిస్తారా? కప్పు టీ తాగనిదే తెల్లవారదా? మీకో గుడ్ న్యూస్. రోజుకు ఒక కప్పు టీ తాగే వారిలో చిత్తవైకల్యం (పెద్ద వయస్కుల్లో వచ్చే మతిమరుపు లేదా డెమెన్షియా) బారిన పడే ముప్పు 50 శాతం తగ్గుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ ఏజింగ్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితం అయ్యాయి. జన్యురీత్యా డెమెన్షియా బారిన పడే వారిలోనూ టీ తాగడం వల్ల ఈ ముప్పు తగ్గుతున్నట్లు తేలింది. తేయాకుల్లో ఉండే థియాఫ్లేవిన్స్, కాటెచిన్స్‌లు యాంటి ఇన్‌ఫ్లేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌లను శరీరానికి అందిస్తున్నాయి. వీటి వల్ల గ్రీన్ టీ తాగుతున్నారా లేదా బ్లాక్ టీనా అనేదా దానితో సంబంధం లేకుండా.. టీ తాగే వారిలో డెమన్షియాను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతున్నట్లు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకులు తెలిపారు.
Samayam Telugu daily cup of tea may be key to reduce risk of dementia study
రోజుకో కప్పు టీ తాగేవారికి వెరీ గుడ్ న్యూస్!


మెదడులో రక్తనాళ సంబంధమైన సమస్యలతోపాటు, న్యూరాన్లు తగ్గుముఖం పట్టడం మొదలైన సమస్యల బారి నుంచి టీలోని సుగుణాలు కాపాడుతున్నట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఫెంగ్ లీ తెలిపారు. వృద్ధాప్యం కారణంగా తలెత్తే న్యూరాన్ల సమస్యలను అరికట్టడంలో తేనీటి సేవనం ఉపయోగపడుతున్నట్లు లీ వెల్లడించారు.

ఇందుకోసం 55 ఏళ్లకు పైబడిన 957 మందిపై 12 ఏళ్లపాటు పరిశోధనలు జరిపారు. వారి జీవన విధానం, ఆరోగ్య పరిస్థితి, శారీరక క్రియలకు సంబంధించిన సమాచారం సేకరించారు. రెండేళ్లకోసారి చొప్పున వారి జ్ఞానాత్మక క్రియలను పరీక్షించారు. దీర్ఘకాలంపాటు టీ తాగిన వారి శరీరంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా జ్ఞానాత్మక క్రియలు మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పార్కిన్సన్‌, నరాలకు సంబంధించిన సమస్యలను నివారించడానికి కూడా టీ తాగే అలవాటు దోహదం చేస్తున్నట్లు తేలింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆనందంలో అర్జెంట్‌గా ఓ కప్పు టీ తాగేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.