యాప్నగరం

నైట్ ‘స్లైడర్స్’.. కుప్పకూలిన కోల్‌కతా

​ ఐపీఎల్‌ ఫైనల్లో పుణేతో తలపడేది ఎవరని నిర్ణయించే కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ తడబడింది.

TNN 19 May 2017, 9:56 pm
ఐపీఎల్‌ ఫైనల్లో పుణేతో తలపడేది ఎవరని నిర్ణయించే కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ తడబడింది. ముంబై బౌలర్ల ధాటికి విలవిల్లాడిన కోల్‌కతా.. 18.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. లిన్ లాంటి హిట్టర్.. నరైన్ లాంటి సంచలన ఓపెనర్.. గంభీర్ లాంటి నిలకడైన బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ షారుక్ ముఖం చిన్నబోయింది. తొలి వికెట్ రూపంలో లిన్‌ను పెవిలియన్‌కు పంపి బుమ్రా నైట్ రైడర్స్‌ను దెబ్బకొట్టగా... వరుసబెట్టి వికెట్లు తీస్తూ కరణ్ శర్మ కోల్‌కతాను బెంబేలెత్తించాడు. వీరిద్దరి ధాటికి గంభీర్ సేన 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇశాంక్ జగ్గీ (31 బంతుల్లో 28), సూర్య కుమార్ యాదవ్ (25 బంతుల్లో 31) కోల్‌కతాను ఆదుకునే ప్రయత్నం చేశారు.
Samayam Telugu mi vs kkr qualifier 2 kolkata all out for 107
నైట్ ‘స్లైడర్స్’.. కుప్పకూలిన కోల్‌కతా


87 పరుగుల వద్ద కరణ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు యత్నంచిన జగ్గీ అవుటవడంతో నైట్‌రైడర్స్ పతనం మరోసారి మొదలైంది. తర్వాత వచ్చిన పియుష్ చావ్లా, నైల్ ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. మలింగ అద్భుత క్యాచ్ పట్టడంతో కుదురుకున్న బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమైంది.

వందో టీ20 మ్యాచ్ ఆడుతున్న బుమ్రా ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. కరణ్ శర్మ 16 పరుగులిచ్చి 4 వికెట్లు కూల్చాడు. ఈ మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్ బదులు జట్టులోకి వచ్చిన గ్రాండ్‌హోమ్ తీవ్రంగా నిరాశ పర్చాడు. బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమైన వేళ.. ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతా స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. ఐపీఎల్ ప్లే ఆఫ్‌లో 107 పరుగులు ఐదో అత్యల్పం కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.