యాప్నగరం

ధోనీ ఇలా ఔటవడం ఇదే తొలిసారి..!

ధోనీ నెమ్మదిగా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌వైపు వెళ్లడాన్ని గమనించిన షమీ అనూహ్యంగా అటువైపు బంతి విసిరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో రనౌట్ ప్రమాదాన్ని

TNN 13 May 2017, 2:47 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అనూహ్యంగా రనౌటై అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. బంతి గమనాన్ని అంచనా వేయడం, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడంలో ధోనీకి తిరుగులేదని ఇప్పటికే చాలా సార్లు నిరూపితమైంది. కానీ.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ధోనీ పొరపాటున రనౌటవడంతో చివరికి పుణె జట్టు మ్యాచ్‌నే చేజార్చుకోవాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పుణె 15.4 ఓవర్లలో 125/4తో గెలుపు దిశగానే సాగుతోంది. ఈ దశలో బెన్‌స్టోక్స్ ఔటవడంతో మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ క్రీజులోకి వచ్చాడు. దీంతో మ్యాచ్‌ని అలవోకగా ధోనీ ముగించేస్తాడని అభిమానులు ఆశించారు.
Samayam Telugu ms dhonis uncharacteristic run out
ధోనీ ఇలా ఔటవడం ఇదే తొలిసారి..!


Rare occasion when MS Dhoni gets run out! pic.twitter.com/NwtKh8XYCH — Nostragamus (@NostragamusApp) May 13, 2017
ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన కమిన్స్ బౌలింగ్‌లో బంతిని ఫైన్‌లెగ్ దిశగా ధోనీ తరలించాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మనోజ్ తివారీ పరుగు కోసం పిలవడంతో అలవోకగా పరుగు పూర్తి చేయచ్చనే ఉద్దేశంతో ధోనీ కూడా సమ్మతించాడు. అప్పటికే బంతి అందుకున్న షమీ కీపర్‌కి బంతిని అందించేలా కనిపించాడు. కానీ.. ధోనీ నెమ్మదిగా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌వైపు వెళ్లడాన్ని గమనించిన షమీ అనూహ్యంగా అటువైపు బంతి విసిరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో రనౌట్ ప్రమాదాన్ని పసిగట్టిన ధోనీ పరుగు వేగాన్ని పెంచినా.. అప్పటికే బంతి డైరెక్ట్‌గా వికెట్లను గీరాటేసింది. పదేళ్ల కెరీర్‌లో ధోనీ ఈ తరహాలో రనౌటవడం ఇదే ప్రథమం. సమన్వయ లోపంతో కొన్నిసార్లు రనౌటైనా.. ఇలా అలక్ష్యం చేస్తూ ఔటవలేదు. ధోనీ నిష్క్రమణతో పుణెపై ఒత్తిడి పెరిగి చివరికి 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ‘ధోనీ అలవోకగా మ్యాచ్‌ని మార్చేయగలడు. వికెట్ల మధ్య అతను వేగంగా పరుగు తీస్తాడు. ఈ రనౌట్‌ కూడా 50-50 ఛాన్స్ అనుకుంటూ బంతి విసిరా. ఫలితం మాకు అనుకూలంగా వచ్చి మ్యాచ్ మలుపు తిరిగింది’ అని షమీ ఆనందం వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.