యాప్నగరం

డబ్బులిస్తాం ఓటేయొద్దు ప్లీజ్.. కన్నడ నాట నయా ట్రెండ్!

మీకు డబ్బులిస్తాం.. ఓటయొద్దు. మీ ఓటర్ ఐడీ మా చేతుల్లో పెట్టండి. ఇదిగో ఈ మందు బాటిల్, రూ.1000 తీసుకోండి. ఇది కర్ణాటకలో నడుస్తోన్న ట్రెండ్.

Samayam Telugu 10 May 2018, 9:41 am
డబ్బులిచ్చి ఓటు కొనుక్కోవడం అనేది ఒకప్పటి మాట. ఎన్నికల్లో గెలవాలంటే మనకు ఓట్లు పడితే చాలదు, ప్రత్యర్థికి ఓట్లు పడకుండా చూడాలి. తమకు ఓటేయకున్నా ఫర్వాలేదు.. ప్రత్యర్థికి ఓటేయకుండా ఓటర్లను అడ్డుకోవాలి. ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన కర్ణాటకలో ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 10 వేల ఓటర్ ఐడీ కార్డులు బయట పడటమే దీనికి నిదర్శనం.
Samayam Telugu karnataka voter ids


సామాజిక కారణాల రీత్యా కొన్ని వర్గాల ప్రజలు కొన్ని పార్టీలకు అసలు ఓటేయరు. దీంతో సహజంగానే ఆ ఓట్లు ప్రత్యర్థి పార్టీకి వెళ్తాయి. దీన్ని అడ్డుకోవడం కోసం అలాంటి ఓటర్లను గుర్తించి.. వారు ఓటేయకుండా చూడటమే ఇప్పుడు రాజకీయ పార్టీలు అనుసరిస్తోన్న వ్యూహం. అంటే మనకు ఓటేయని వారు ప్రత్యర్థికి ఓటేయకుండా అడ్డుకోవడం వల్ల మన గెలుపు తేలిక అవుతుందని రాజకీయ పక్షాలు నమ్ముతున్నాయి.

ఇలా తమ పార్టీకి ఓటేసే అవకాశం లేని వ్యక్తులు ఓటింగ్‌కు దూరంగా ఉండటం కోసం డబ్బులిచ్చి వారి దగ్గర నుంచి ఓటర్ ఐడీలను తీసుకుంటారు. మారుమూల పల్లెటూళ్లలో ఓటర్ ఐడీకి రూ.100 మాత్రమే ఇస్తే.. బెంగళూరు మురికి వాడల్లో రూ. 2 వేల వరకూ ముట్టజెప్తున్నారు.

‘‘బీజేపీ అభ్యర్థి మద్దతుదారులు నన్న కలిశారు. ఓటేయకుండా ఉంటే వెయ్యి రూపాయలు ఇస్తామన్నార’’ని హెబ్బాల్‌లో కార్పెంటర్‌గా పని చేసే అర్భాజ్ ఖాన్ (పేరు మార్చాం) చెప్పాడు. దీనికి నేను ఒప్పుకున్నాను. ఓటేయకుండా ఉండటానికి అంగీకరించిన మా కాలనీ వాసులకు డబ్బుతోపాటు విస్కీ కూడా పంచారని అర్భాజ్ చెప్పాడు.

ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఓటర్ ఐడీకి రూ.500 చొప్పున చెల్లించి బీజేపీ గుర్తింపు కార్డులను తీసుకుందని శివ మొగ్గ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన కుమార్ బంగారప్ప ఆరోపించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

ఎన్నికల అధికారులు మాత్రం ఇది సాధ్యం కాదని చెబుతున్నారు. ఇలా ఒకే వర్గానికి చెందిన వారిని ఓటేయకుండా అడ్డుకుంటారనడానికి ఆధారాలు లభిస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఓటర్ ఐడీ లేకున్నా.. ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఇతర ఐడీ ప్రూఫ్‌లను ఉపయోగించి ఓటేయొచ్చని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.