యాప్నగరం

‘మత్తు’ను కనిపెట్టే పరికరం.. తెలుగమ్మాయి ఘనత

ప్రస్తుతం యువత జీవితాన్ని నాశనం చేస్తున్న వ్యసనాల్లో మాదకద్రవ్యాలే అత్యంత ప్రమాదకరంగా మారాయి.

TNN 16 Jul 2017, 3:46 pm
ప్రస్తుతం యువత జీవితాన్ని నాశనం చేస్తున్న వ్యసనాల్లో మాదకద్రవ్యాలే అత్యంత ప్రమాదకరంగా మారాయి. పాఠశాలలకు వెళ్లే చిన్ని పిల్లలు సైతం మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న సంఘటనలు తాజాగా చూస్తున్నాం. ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వచ్చాక ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. స్కూల్‌కని, కాలేజ్‌కని, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి పబ్‌లు, పార్టీల చుట్టూ తిరుగుతూ మత్తుకి అలవాటుపడుతున్నారు. చిన్నపిల్లల్ని సైతం తన ఉచ్చులోకి లాగుతున్న మాదకద్రవ్యం అనే భూతాన్ని అరికట్టాలని యోచించిన ఓ అమ్మాయి సరికొత్త పరికరాన్ని రూపొందించింది.
Samayam Telugu nri girl alia mohammad created a device called prorenata to alerts the parents
‘మత్తు’ను కనిపెట్టే పరికరం.. తెలుగమ్మాయి ఘనత


డ్రగ్స్‌ను పసిగట్టడమే కాకుండా.. పిల్లలు డ్రగ్స్ వాడుతున్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపే పరికరాన్ని భారత సంతతికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి అందుబాటులోకి తెచ్చింది. ఈ పరికరం గాలి, చెమట వాసన ద్వారా పిల్లల డ్రగ్స్ వాడకాన్ని పసిగడుతుంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న సెయింట్ ఏనియల్ హై స్కూల్‌లో 10వ తరగతి చుదువుతున్న అలియా మహమ్మద్ తన మిత్రుల సాయంతో ఈ పరికరాన్ని తయారుచేసింది. ఇది ఒక రిస్ట్ బ్యాండ్. ఈ డివైజ్‌ను మొబైల్‌తో కనెక్ట్ చేసి వినియోగించాలి.

ఇంతకీ ఈ అలియా స్వస్థలం విజయవాడ. 20 ఏళ్ల క్రితం అలియా కుటుంబం టెక్సాస్‌లో స్థిరపడింది. అలియా అక్కడే జన్మించింది. అలియా తండ్రి ఆసిఫ్ మహమ్మద్ టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారు. అలియా తాతయ్య విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైరయ్యారు. పిల్లల జీవితాలను పాడుచేస్తూ అత్యంత ప్రమాదకరంగా తయారైన మాదకద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేయాలని భావించిన అలియా మిత్రులతో కలసి ‘ప్రోరినాటా (ProReNata)’ అనే పరికరాన్ని తయారుచేసింది. ఇటీవల అమెరికాలో ఈ పరికరాన్ని ఆవిష్కరించారు.

ఈ పరికరాన్ని పిల్లల చేతికి పెట్టాలి. యాప్‌ను తల్లిదండ్రులు తమ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని రిస్ట్ బ్యాండ్‌ను అనుసంధానం చేయాలి. ఒకవేళ పిల్లలు డ్రగ్స్ తీసుకోవడానికి వెళ్తే.. వారి చేతికి ఉన్న బ్యాండ్ చెమట లేదా గాలి వాసన ద్వారా పసిగట్టి తల్లిదండ్రుల మొబైల్‌కి సమాచారం అందిస్తుంది. అప్పుడు పిల్లలు ఉన్న ప్రాంతాన్ని మొబైల్ అప్లికేషన్ ద్వారా తల్లిదండ్రులకు తెలుపుతుంది. తన కూతురు ఇంత మంచి పరికరాన్ని తయారుచేసినందుకు తండ్రి ఆసిఫ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరికరాన్ని మార్కెటింగ్ చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని అలియా చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.