యాప్నగరం

ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. రేపటి నుంచే నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాలు ప్రత్యేకమైనవి. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గగా పూజలందుకునే జగన్మాత, నవరాత్రుల్లో వివిధ రూపాల్లో దర్శనమివ్వనుంది.

Samayam Telugu 9 Oct 2018, 11:32 am
దసరా మహోత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అందంగా ముస్తాబైంది. దుర్గా మల్లేశ్వరస్వామి సన్నిధిలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అక్టోబర్‌ 10 నుంచి 18 వరకూ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాత మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతి రూపంలో జగన్మాత భక్తులను అనుగ్రహించనుంది. విజయ దశమి రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా అలంకారుభూషితమై దుర్గాదేవి భక్తులను అనుగ్రహిస్తారు.
Samayam Telugu దసరా ఉత్సవాలు


దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల మంది వరకూ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలు సిద్ధం చేశారు. ఆశ్వయుజ మాసం తొలి రోజు అంటే బుధవారం ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక మరుసటి రోజు నుంచి ఉదయం 3 గంటలకే దర్శనం ప్రారంభించి రాత్రి 11 వరకు అవకాశం కల్పిస్తారు. అక్టోబరు 14న ఆదివారం మూలా నక్షత్రం రోజున రాత్రి 1 గంట నుంచే దర్శనానికి అనుమతిస్తారు.

దసరా రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మహిషాసురమర్దినిగా, మధ్యాహ్నం 1 గంట నుంచి రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల్లో భద్రత కోసం 5,400 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అన్నదానంతోపాటు ఉచితంగా పులిహోర, కదంబం, అప్పం ప్రసాదం ఉచితంగా అందిస్తారు. అర్జునవీధిలోని శృంగేరి సత్రం, బాలభవన్ వద్ద ఉదయం 10 గంటల నుంచే అన్నప్రసాదం వితరణ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి పెరుగు, సాంబారన్నం అందజేస్తారు. భక్తులకు కోరినన్ని లడ్డూలు, పులిహోర విక్రయించాలని నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.