యాప్నగరం

Ugadi 2019: ఉగాది పచ్చడి.. వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధం!

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలయికే ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులు, కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.

Samayam Telugu 4 Dec 2022, 11:43 pm
ఉగాదినాడు పంచాంగ శ్రవణంతోపాటు పచ్చడికి విశేష ప్రాధాన్యత ఉంది. ముఖ్యమైంది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలయికే ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులు, కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. దీని కోసం చెరకు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, బెల్లం వాడుతారు.
Samayam Telugu Ugadi pachadi Tel


ఉగాది పచ్చడికి ఆయుర్వేద శాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’ ‘అశోకకళికా ప్రాశనం’అని పేర్లతో వ్యవహరించేవారు. ఋతు మార్పుల కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఓ ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, మిరప కాయలు, మామిడి కాయలు ఉపయోగించేవాళ్లు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

బెల్లంలోని తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకు, విజయానికి సంకేతం. వేపలోని చేదు దుఃఖానికీ, నష్టానికీ, ద్వేషానికీ అపజయానికీ సంకేతం. ఈ రెండు కలిపి తినడం అంటే సుఖదుఃఖాలు, ప్రేమానురాగాలు, విజయాలు చేకూరాలని చెప్పడమే. ‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు’ అనే ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం, ఆహారంలో ఉండే ఓ ఔషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాదు హిందూ పండుగలకు, ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని విశదీకరిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.