యాప్నగరం

Navami: నవమి రోజున ఈ సమయంలో పూజ చేస్తే...

త్రేతాయుగం వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడి జననం జరిగిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో జన్మించాడు.

Samayam Telugu 13 Apr 2019, 2:49 pm
సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినం చైత్రశుద్ధ నవమిని శ్రీ రామ నవమిగా జరుపుకుంటారు. భారతదేశంలో రామాలయం లేని గ్రామం ఉండదంటే అతిశయోక్తి కాదు. నవమి రోజున చలువ పందిళ్లు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. వడపప్పు, పానకం, నైవేద్యంగా సమర్పించి అందరకీ పంచుతారు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
Samayam Telugu Jagadanandakaraka


శ్రీరామనవమి రోజున తెల్లవారుజామునే నిద్ర మేల్కొని తల స్నానం చేసి పసుపు రంగు వస్రాలు ధరించాలి. ఇంటిని శుద్ధిచేసి పూజామందిరాన్ని అలకరించుకోవాలి. అలాగే వాకిలిలో రంగవల్లులు వేయాలి. పూజకు ఉపయోగించే ప్రతిమలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. శ్రీ సీతారామలక్ష్మణ సమేత ప్రతిమను కానీ లేదా కేవలం శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. అర్చన కోసం సన్నజాజి, తామర పుష్పాలు, నైవేద్యం కోసం పానకం, వడపప్పు, కమల ఫలాలు సిద్ధం చేసుకోవాలి.

పూజా సమయంలో శ్రీరాముడి అష్టోత్తరం, శ్రీరామరక్షా స్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రం, శ్రీమద్రామాయణంలోని శ్లోకాలను కూడా పఠించాలి. శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.ప్రసిద్ధి చెందిన శ్రీరాముని ఆలయాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం. దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర పూజ, సీతారామకల్యాణం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తే మనసులోని కోరికలు నెరవేరి సిరిసంపదలు చేకూరుతాయి.

అలాగే నవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతాన్ని ఆచరించడం మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో పూజ ప్రారంభించాలి. పూజ చేసేటప్పుడు మెడలో తులసి మాలను ధరించాలి. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీరామ నిత్యపూజ లాంటి పుస్తకాలను ముత్తైదువులకు దానం ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.