యాప్నగరం

Ratha Saptami: అరసవల్లి, తిరుమలలో ఘనంగా రథ సప్తమి వేడుకలు

నేడు రథ సప్తమిని పురష్కరించుకుని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంతో పాటు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహిస్తున్నారు.

Samayam Telugu 12 Feb 2019, 10:02 am
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యనారాయణ స్వామి జయంతి సందర్భంగా రథ సప్తమి వేడుకను కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. రథ సప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామిని దర్శించికునేందుకు తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు.
Samayam Telugu Ratha_Sapthami


సోమవారం అర్ధరాత్రి దాటిన తరవాత సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలు మొదలయ్యాయి. స్వామి వారికి సుప్రభాత సేవ, ఉషాకాల అర్చనతో పాటు మహాభిషేక సేవ నిర్వహించారు. తరవాత తెల్లవారుజామున 5 గంటల వరకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు సూర్యనారాయణుడికి విశేష అర్చనలు, ద్వాదశ హారతి, మహా నివేదన వంటి కార్యక్రమాలను జరుపుతారు. తరవాత స్వామి వారికి పుష్పమాల అలంకరణ సేవ నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో రథ సప్తమి వేడుకలు ముగుస్తాయి.

అటు తిరుమలలోనూ రథ సప్తమికి టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండటంతో ఆర్జిత సేవలను రద్దు చేసింది. సర్వ దర్శనం భక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కేవలం ప్రొటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించనున్నారు. రథ సప్తమి సందర్భంగా శ్రీవారు ఏడు వాహనాలపై ఊరేగనున్నారు. తిరుమలలో మంగళవారం వేకువ జామున రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం ఆలయాన్ని ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం 4 గంటలకు మలయప్పస్వామి వాహన మండపానికి వేంచేయడంతో వేడుకలు మొదలయ్యాయి.

వాహన మండపం నుంచి సూర్యప్రభలో ఆశీనులై 5.30 గంటలకు స్వామి ఊరేగింపునకు బయలుదేరుతారు. నాలుగు మాడవీధుల్లో ప్రదక్షిణగా పడమర, ఉత్తర దిశలు కలిసే మూలలోకి వేంచేసి తూర్పుదిక్కుగా నిలబడతారు. సూర్యకిరణాలు మలయప్పస్వామిని తాకగానే అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం వాహనం ఊరేగింపు సేవ మొదలవుతుంది. 9 గంటలకు చిన్న శేషవాహనం, 11 గంటలకు గరుడవాహనం, మధ్యాహ్నం 1 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్షవాహనం, 6 గంటలకు సర్వభూపాలవాహనం, రాత్రి 8 నుంచి చంద్రప్రభ వాహనంపై శ్రీవారిని ఊరేగిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.