యాప్నగరం

కేవలం 40 మంది సమక్షంలోనే భద్రాద్రి రామయ్య కళ్యాణం

ఏటా శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భద్రాదికి భక్తులు భారీగా తరలివస్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం కిటకిటలాడుతోంది. కానీ, ఈసారి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది.

Samayam Telugu 5 Dec 2022, 3:14 pm
కరోనా వైరస్ ప్రభావం ఆలయాలపై కూడా తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆలయాలలోని భక్తులను అనుమతించకుండా ఏకాంతంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, ఏటా శ్రీరామ నవమి పర్వదినం నాడు రామాలయాల్లో సీతారాములకు జరిగే కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. శ్రీరాముడి కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని భక్తకోటి ఎదురుచూసే ఈ శుభదినం ఈ ఏడాది మాత్రం భక్తులకు ఆ భాగ్యం దక్కలేదు. భద్రాద్రి రామాలయంతో పాటు అన్ని ఊళ్లలోని ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి. కరోనా మహమ్మారి కారణంగా రామయ్య కళ్యాణాన్ని ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. దీంతో, ఈసారి టీవీల్లోనే కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు.
Samayam Telugu Lord Rama

PC:Unsplash

భద్రాచలం సీతారామస్వామి దేవస్థానం చరిత్రలో తొలిసారి కళ్యాణాన్ని నిత్య కళ్యాణ మండపం వద్ద నిర్వహిస్తున్నారు. రామాలయం నిర్మాణం తర్వాత గత 350 ఏళ్లలో భక్తులు లేకుండా ఏనాడు ఈ విధంగా కళ్యాణం జరగలేదు. రామయ్య కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. కేవలం 40 మంది సమక్షంలోనే రామయ్యకు కళ్యాణోత్సవం జరిగింది. వైదిక పండితులు, కొందరు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.

సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో నడయాడిన నేలగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణం నిరాడంబరంగా సాగుతోంది. ఉదయం 4 నుంచి 5 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహించిన వేదపండితులు.. ఉదయం 8 గంటలకు ధ్రువమూర్తుల కళ్యాణం నిర్వహించారు. ఈ క్రతువు ముగిసిన తర్వాత కళ్యాణ మూర్తులకు అలంకరణ చేసి నిత్య కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు.

రంగు రంగుల పూలతో అలంకరించిన పెళ్లి మండపంలో సిరికల్యాణపు బొట్టును బెట్టి, మణిబాసికం, బుగ్గనచుక్క, పాదాలకు పారాణితో వరుడిగా రామయ్య, సొంపుగా కస్తూరి నామమం, కనకాంబరాలు, మల్లెలతో ఇంపైనా పూలజడ, చంపక వాకీ చుక్కతో పెళ్లి కుమార్తెగా సీతమ్మ కొలువుదీరి ఉన్నారు. ఉదయం 10.30 నుంచి 12.30 మధ్య కర్నాటక లగ్నం అభిజిత్ మూహూర్తంలో కళ్యాణం జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.