యాప్నగరం

అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి జనవరి 31న భూకర్షణ

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరుని వైభవాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తిచేయడానికి టీటీడీ అనేక కార్యక్రమాలను చేపడుతోంది.

Samayam Telugu 9 Jan 2019, 9:38 am
రాజధాని అమరావతిలో దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ నిర్మించనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణానికి ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేయనున్నారు. ఇక, ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిని అనుసంధానిస్తూ ఆధీనంలోకి తీసుకునే భూకర్షణలో భాగంగా జనవరి 31న ఉదయం ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ క్రతువు నిర్వహించాలని తీర్మానించింది. రూ.150కోట్లతో చేపట్టనున్న ఆలయ నిర్మాణానికి ఇప్పటికే నాలుగు దశల్లో పిలిచిన టెండర్లకు ఆమోదముద్ర తెలిపింది. ఈ మేరకు మంగళవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నిర్మించబోయే 2వేల గదుల తొలిదశలో భాగంగా 384 గదుల నిర్మాణానికి రూ.67.29 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపారు.
Samayam Telugu ttd


వైకుంఠం-2 నుంచి ఆళ్వారు ట్యాంకు వసతి సముదాయం గేటు వరకు రూ.17.21 కోట్లతో అత్యాధునిక క్యూలైను నిర్మాణానికి టెండరు ఖరారు చేశారు. టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యులు వేదాంతం దేశికాచార్యులు మరణంతో ఏర్పడిన ఖాళీని శ్రీవారి ఆలయ అర్చకులు అనంతశయన దీక్షితులుతో భర్తీ చేయనున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన పార్వతీపురంలో రూ.2.90 కోట్లు, జిల్లా సీతంపేటలో రూ.2.86 కోట్లు, రామచంద్రపురంలో రూ.2.99 కోట్లతో శ్రీవారి దివ్యక్షేత్రాల నిర్మాణానికి టెండర్లకు ఆమోదముద్ర వేశారు. అలాగే, ఇటీవల వయోపరిమితి నిబంధన విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని పాలక మండలి తీర్మానించింది. కోర్టు తీర్పును అమలుచేస్తే శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుందనే చర్చ జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.