యాప్నగరం

జమ్మూ నుంచి అమర్‌నాథ్‌కు బయలుదేరిన మరో బృందం

జమ్మూ కశ్మీర్‌లో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు తగ్గి, వాతావరణం అనుకూలించడంతో అమర్‌నాథ్ యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతోంది.

Samayam Telugu 14 Jul 2018, 3:31 pm
జమ్మూ కశ్మీర్‌లో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు తగ్గి, వాతావరణం అనుకూలించడంతో అమర్‌నాథ్ యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతోంది. జూన్ 28 న యాత్ర ప్రారంభమైన నాటి నుంచి శుక్రవారం వరకు దాదాపు 1.60 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ గుహను దర్శించుకున్నారు. తాజాగా 3,048 మంది యాత్రికులతో కూడిన మరో బృందం శనివారం జమ్మూ నుంచి బయలుదేరింది. వీరిలో 623 మంది మహిళలు, 144 మంది సాధువులు ఉన్నారు. వీరంతా కలిసి 122 వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య బయలుదేరినట్టు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ఇందులో 310 మంది మహిళలు, 144 మంది సాధువులతో సహా 1973 మంది యాత్రికులు నున్వాన్ క్యాంప్‌నకు చేరుకుని పెహల్గామ్ మార్గం నుంచి, 1,075 మంది బల్తాల్ మార్గం గుండా అమర్‌నాథ్ చేరుకుంటారని ఆయన తెలియజేశారు. వీరంతా ఆదివారం ఉదయానికి బేస్ క్యాంప్‌ను చేరుకుంటారు. రెండు నెలల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 26తో ముగుస్తుంది. రాఖీ పండుగ రోజే యాత్ర ముగియనుండటం విశేషం.
Samayam Telugu అమర్‌నాథ్ యాత్ర


మరోవైపు అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతిచెందారు. పంజాబ్‌లోని నూర్‌మహల్‌కు చెందిన సతీశ్ కుమార్ (39), గుజరాత్‌కు చెంది శ్యామ్ భాయ్ (54)లుగా గుర్తించారు. తమ బృందంతో కలిసి అమర్‌నాథ్‌‌కు గురువారం ఉదయం చేరుకున్న వీళ్లు, బాబా బఫ్రానీ దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతుండగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో అక్కడ ఉన్న వైద్యులు వీరికి ప్రాథమిక చికిత్స చేసి హెలికాప్టర్ ద్వారా శ్రీనగర్ తరలించడానికి ప్రయత్నించగా, అప్పటికే వీరు తుదిశ్వాస విడిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.