యాప్నగరం

తథాస్థు దేవతలంటే ఎవరు?

వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు.

TNN 9 May 2017, 8:21 pm
వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.
Samayam Telugu hindus do you believe in tathastu gods
తథాస్థు దేవతలంటే ఎవరు?


మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.

అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు.. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.

చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.