యాప్నగరం

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కోర్టు కేసుల్లో ఇరుక్కొని ఊపిరి ఆడటం లేదా? ఈ గుడికి వెళ్లి పూజలు చేస్తే చిక్కులు తొలగిపోతాయట.

TNN 30 Jul 2017, 2:57 pm
మన దేశంలో సినిమా వాళ్లకు, గొప్ప నాయకులకు గుళ్లు ఉండటం సాధారణమే. కానీ ఓ న్యాయనిర్ణేతకు గుడి ఉండటం మాత్రం అరుదైన విషయం. కేరళలోని కొట్టాయం జిల్లాలో ‘జడ్జి అంకుల్’ పేరిట న్యాయనిర్ణేతకు ఓ గుడి కట్టించారు. చెరువల్లి శ్రీ దేవి ఆలయంలో ఓ మూలన ఈ గుడి ఉంటుంది. ఇదేమీ ఆషామాషీ గుడి కాదు. న్యాయపరంగా సమస్యలను ఎదుర్కొంటున్నవారు జడ్జి అంకుల్‌ను దర్శించుకుని కేసుల నుంచి బయటపడుతున్నారు. పీకల్లోతు కేసుల్లో మునిగిపోయిన గాలి జనార్ధన్ రెడ్డి కూడా ఈ గుడికెళ్లి వచ్చాకే ఉపశమనం పొందాడట. మళయాళ నటిపై అత్యాచారం కేసులో నటుడు దిలీప్ జైలుకు వెళ్లడంతో ఆయన సోదరుడు అనూప్ వెంటనే ఈ గుడికొచ్చి పూజలు జరిపించారు.
Samayam Telugu judge uncle diety for legal issues
కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి


అంతెందుకు తరాల నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని మరీ.. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి ఆడవాళ్లకు ప్రవేశం కల్పించాలని సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీంతో ట్రావెన్‌కోర్ దేవసం బోర్డు ప్రెసిడెంట్ పి. గోపాలక్రిష్ణన్ కూడా ‘జడ్జి అమ్మవన్‌ (అంకుల్)ను దర్శించుకున్నారు. ఈ గుడికి అంతటి ప్రాధాన్యం ఉంది.

ఇదంతా చదివాక.. ఈ గుడి వెనకాల ఉన్న నేపథ్యం ఏంటో తెలుసుకోవాలి అనిపిస్తోంది కదూ. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతం ట్రావెన్‌కోర్ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ రాజ్యంలోని గోవింద పిళ్లై అనే న్యాయనిర్ణేతకు కచ్చితమైన తీర్పులు ఇవ్వడంలో తిరుగులేని వాడిగా పేరొందాడు. అలాంటిది.. ఆయన ఓసారి పొరబాటున తన మేనల్లుడు నేరం చేశాడని పొరబడ్డారు. అతడికి మరణ శిక్ష విధించారు. తర్వాత అతడు అమాయకుడని తెలియడంతో.. తప్పుడు తీర్పు వెలువరించినందుకు గానూ.. పిళ్లై తనకు తానే ఉరిశిక్ష విధించుకున్నారు. తప్పు చేస్తే ఎలాంటి శిక్షను అనుభవించాల్సి వస్తుందో జనాలకు తెలియడం కోసం తన మృతదేహాన్ని మూడు రోజులపాటు అలాగే బహిరంగ ప్రదేశంలో ఉంచాలని కూడా తీర్పునిచ్చారు.

న్యాయానికి కట్టుబడి ఉండాలన్న పిళ్లై తపన అక్కడి ప్రజలను కదిలించింది. దీంతో ఆయనకు గుడి కట్టించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆయన ఆత్మ ఈ గుడిలో ఉంటుందని వారు విశ్వసిస్తారు. ఈ నమ్మకం బలపడటంతో ఎక్కడెక్కడి నుంచో జనం ఈ గుడికి వచ్చి పూజలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.