యాప్నగరం

శ్రీవారి ఆలయంలో అపచారం.. నేలను తాకిన మలయప్పస్వామి విగ్రహం

సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని గర్భాలయంలోకి తీసుకొస్తుండగా అర్చకుని చేతిలోని శ్రీమలయప్పస్వామి విగ్రహం పట్టుతప్పి నేలను తాకింది.

Samayam Telugu 9 Sep 2018, 8:02 am
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం అపచారం చోటు చేసుకుంది. సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని గర్భాలయంలోకి తీసుకొస్తుండగా అర్చకుని చేతిలోని శ్రీమలయప్పస్వామి విగ్రహం పట్టుతప్పి నేలను తాకింది. శ్రీవారికి రోజూ సాయంత్రం వేళ వేయి దీపాలతో ఆలయ ముఖద్వారం సమీపంలోని మండపం వద్ద సహస్రదీపాలంకరణ సేవ జరుగుతుంది. అనంతరం మాడవీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. శనివారం కూడా తిరువీధి ఉత్సవం ముగిసిన తర్వాత ఆలయంలోని గరుడాళ్వారు విగ్రహం పక్కనున్న ఖాళీ ప్రదేశంలోకి తిరుచ్చి వాహనాన్ని తీసుకువచ్చి ఉంచారు. ముందుగా అందులోని శ్రీదేవి అమ్మవారి విగ్రహాన్ని అర్చకులు దించి శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లారు. అనంతరం మరో అర్చకుడు శ్రీమలయప్పస్వామివారి విగ్రహాన్ని లోనికి తీసుకొస్తుండగా జయవిజయుల విగ్రహాల ఎదుట ఆయన కాలు మడత పడింది. అర్చకుడు పట్టుతప్పడంతో విగ్రహం నేలను తాకింది.
Samayam Telugu శ్రీవారి ఆలయంలో అపచారం


దీంతో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు సుందర వరదభట్టాచార్యులు సమావేశమై ప్రాయశ్చిత్తంగా సంప్రోక్షణ నిర్వహించాలని నిర్ణయించారు. తక్షణమే స్వామివారి దర్శనం నిలిపివేసి యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా లఘు సంప్రోక్షణ, శాంతి యాగం నిర్వహించారు. ఈ క్రతువు అనంతరం శ్రీవారి దర్శనాన్ని తిరిగి పునరుద్ధరించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపల సైతం భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుని శనివారం 83,016 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,429 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లుగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.