యాప్నగరం

నేటి నుంచే టీటీడీ ఆధ్వర్యంలో 12 వేల ఆలయాల్లో మనగుడి

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Samayam Telugu 23 Aug 2018, 9:02 am
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 11,730 ఆలయాల్లో మనగుడి కార్యక్రమం జరుగనుంది. భారతీయ హైందవ సనాతన ధర్మాన్ని పరిరక్షించి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో 2012లో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 12 వ విడత మనగుడి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఆలయాలకు ఇప్పటికే అక్షింతలు, శ్రీవారి కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ తదితర పూజాసామగ్రిని పంపిణీ చేశారు.
Samayam Telugu మనగుడి కార్యక్రమం


మనగుడి కార్యక్రమంలో భాగంగా తొలిరోజు అంటే ఆగస్టు 23న ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లోని భక్తులు స్వచ్ఛందంగా ఆలయాలను శుభ్రం చేసి రంగవళ్లులు, తోరణాలతో అలంకరిస్తారు. ఆగస్టు 24న వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. ఆగస్టు 25న నగర సంకీర్తన, భజన కార్యక్రమాలు చేపడతారు. ఆగస్టు 26న శ్రావణపౌర్ణమి సందర్భంగా మనగుడి ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులోభాగంగా భక్తులకు అక్షింతలు, శ్రీవారి కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ పంపిణీ చేస్తారు.

హిందూ మత ఆచార సంప్రదాయాలు, భక్తి భావాలను పెంపొందించడమే కాకుండా, హైందవ మత విశిష్టతను కూడా తెలియజెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార, ఇతర వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ప్రతి ఆలయం, గ్రామ స్థల పురాణాన్ని భావితరాలకు తెలియజెప్పాలని టీటీడీ కంకణం కట్టుకుంది. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి కూడా పెద్ద సంఖ్యలో స్పందన లభించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.