యాప్నగరం

వైభవంగా సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరిలో గోపాలుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలకు విశిష్టత ఉంది. తొమ్మిది రోజులూ స్వామివారు ఒక్కో వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం, సాయంత్రం వేర్వేరు వాహన సేవలు నిర్వహిస్తారు.

Samayam Telugu 12 Oct 2018, 4:09 pm
తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్ర‌వారం ఉదయం మలయప్పస్వామి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనభాగ్యం కల్పించారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ సింహ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త తపాలా శాఖ రూపొందించిన సింహ వాహ‌నం పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను టీటీడీ ఈవో అనిల్‌కుమార్ ఆవిష్క‌రించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహం వాహనంపై స్వామి ఊరేగారు. పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సింహం సంకేతం.
Samayam Telugu Srivari


నిద్రలేవగానే దర్శించే వాటిలో అతి ముఖ్యమైంది సింహదర్శనం. సింహవాహనం దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ముందుకు సాగి సర్వత్రా విజయం సాధించి ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు.
మరోవైపు శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. అనంతరం ముత్యపుపందిరి వాహన సేవ నిర్వహిస్తారు.

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి సమయం అనుకూలం. అందుకే స్వామికి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే సంప్రదాయన్ని నిర్వహిస్తారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుంచి రాలి, దుర్లభమైన మానవజన్మగా అవతరిస్తుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షాన్ని పొందుతుంది. స్వామికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు, రత్నాల వల్ల కలిగే వేడిమి, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, వక్షస్థలంతోపాటు అచట కొలువైన్న లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.