యాప్నగరం

ఆరు రోజుల్లో 81 వేల మందికి అమర్‌నాథ్ దర్శనం.. ఇద్దరు తెలుగువాళ్లు మృతి

హిమాలయ పర్వత శ్రేణుల్లోని గుహాలో గుంభనంగా కనిపించే శుద్ధ స్పటిక రూపం అమర్‌నాథుడు. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసింది. శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గామ్ నుంచి అమర్‌నాథ్‌ యాత్ర మొదలవుతుంది.

Samayam Telugu 7 Jul 2019, 1:28 pm
జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో దాదాపు 14 వేల అడుగుల ఎత్తులోని గుహలో సహజ సిద్ధంగా ఏర్పడే హిమ లింగాన్ని దర్శించుకోడానికి ప్రతి హిందువు తహతహలాడుతాడు. ప్రతికూలతలను సైతం లెక్కచేయకుండా కొండలను ఎక్కుతూ అమర్‌నాథ్‌ను దర్శించుకుంటారు. ఏడాదిలో 45 రోజుల మాత్రమే ఉండే మంచు లింగాన్ని చూసే భాగ్యం దక్కుతుంది. ఉగ్రవాదుల హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. దీనికి తోడు వాతావరణం కూడా కొంత మేర అనుకూలించడంతో యాత్ర ప్రారంభమైన ఆరు రోజుల్లోనే 81 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.
Samayam Telugu pjimage (43)


ఇక, కట్టుదిట్టమైన భద్రత మధ్య 5,124 మందితో కూడిన ఏడో బృందం 226 వాహనాల్లో శనివారం భగవతీనగర్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి అమర్‌నాథ్‌కు బయలుదేరింది. వీరిలో 864 మంది మహిళలు, 187 మంది సాధువులు, 19 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 3,130 మంది పహల్గావ్ ద్వారా, 1994 మంది బల్తాల్ ద్వారా అమర్‌నాథ్ చేరుకుంటారు. గత ఆరు రోజుల్లో 81,630 మంది యాత్రికులు హిమ లింగాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. జమ్ములో అమర్‌నాథ్‌ యాత్రికుల కోసం సంచార సహాయ కేంద్రాన్ని సీఆర్పీఎఫ్‌ ప్రారంభించింది.

మరోవైపు.. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తెలుగు భక్తుల సంఖ్య రెండుకు చేరింది. రెండు రోజుల కిందటే కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భాగ్యమ్మ అనే మహిళ కన్నుమూశారు. శనివారం పులివెందులకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి (68) అనే విశ్రాంత ఉద్యోగి మృతి చెందారు. అమరనాథుడిని దర్శించుకోవడానికి భార్య, బంధువులతో కలిసి వెళ్లిన ఆయన అక్కడే కన్నుమూశారు. వృత్తిరీత్యా పులివెందులలో స్థిరపడిన ఆయన స్థానిక శేషారెడ్డి పాఠశాల సమీపంలో కుటుబంతో కలిసి నివసిస్తున్నారు. డిగ్రీ కాలేజీలో క్లర్కుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. భార్య, బంధువులు, సుమారు 60 మందితో కలిసి జూన్ 28న తీర్థయాత్రలకు బయలుదేరారు.

ఢిల్లీ, అమృతసర్‌ మీదుగా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. శనివారం అమరనాథుని ఆలయానికి చేరుకున్నారు. మంచు లింగాన్ని దర్శించుకున్న అనంతరం ఓ చోట విశ్రాంతి తీసుకునేందుకు మెట్లు దిగుతుండగా లక్ష్మీనారాయణరెడ్డి కాలుజారి కిందపడిపోయారు. భయాందోళనకు గురై గుండె నొప్పి అంటూ కుప్పకూలారు. దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. బంధువులు ఆయనను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.