యాప్నగరం

శ్రీశైలంలో తాంత్రిక హోమం.. ఆస్థాన పండితుడిపై వేటు

గతేడాది బెజవాడ కనకదుర్గ ఆలయం, పదిహేను రోజుల కిందట సింహాచల క్షేత్రపాలకుడు భైరవస్వామి ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారంపై చెలరేగిన దుమారం ఇంకా సద్దుమణగలేదు.

Samayam Telugu 26 Dec 2018, 7:53 am
గతేడాది బెజవాడ కనకదుర్గ ఆలయం, పదిహేను రోజుల కిందట సింహాచల క్షేత్రపాలకుడు భైరవస్వామి ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారంపై చెలరేగిన దుమారం ఇంకా సద్దుమణగలేదు. తాజాగా శ్రీశైలంలో తాంత్రిక హోమం నిర్వహించిన వ్యవహారం వెలుగుచూసింది. ఈ హోమాన్ని మల్లికార్జునస్వామి ఆలయం వేద పండితుడే నిర్వహించినట్టు తేలడంతో అతడిని విధుల నుంచి తప్పించారు. తాంత్రిక హోమం చేశారన్న అభియోగంపై వేదపండితుడు గంటి రాధాకృష్ణను ఈవో శ్రీరామచంద్రమూర్తి మంగళవారం సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆయన.. దేవస్థానం అనుమతి లేకుండా తాంత్రిక హోమాలను నిర్వహించారనే సమాచారం మేరకు వేద పండితుడిని విధుల నుంచి తప్పించామని తెలిపారు. ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రసాద్‌రెడ్డి, వైదిక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాధాకృష్ణపై సంబంధిత చర్యలు తీసుకున్నట్టు ఈవో వివరించారు. ఆస్థాన వేద పండితుడు గంటి రాధాకృష్ణ డిసెంబరు 22న తన నివాసంలో నిర్వహించిన హోమంపై పెను దుమారం రేగింది.
Samayam Telugu srisailam


ఈ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 22న అర్ధరాత్రి 12 గంటల తర్వాత వేదపండితుడు గంటి రాధాకృష్ణ తన నివాసంలో త్రికోణాకృతిలో హోమగుండం ఏర్పాటు చేసి హోమం నిర్వహించారన్నారు. ఈ వ్యవహారాన్ని ఆలయ ముఖ్యభద్రతాధికారి ప్రసాద్‌రెడ్డి తన తనిఖీల్లో గుర్తించారని తెలిపారు. అనంతరం సీఎస్‌వో, ఆగమ సలహామండలి సభ్యుల నివేదిక ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఈవో వెల్లడించారు. గతేడాది డిసెంబరు 26 అర్ధరాత్రి విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించిన వ్యవహారంపై రాజకీయంగా పెను ప్రకంపనలు రేపింది. ఈ పూజల వెనుక నాటి ఈవో సూర్యకుమారి ఉన్నారనే విషయం విచారణలో తేలడంతో ఆమెను సస్పెండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.