యాప్నగరం

వినయం ఉంటే విజయం వరిస్తుంది.. అగ్నిదేవుడు- అంగీరస మహర్షి కథ

హైందవ సంస్కృతిని సుసంపన్నం చేసిన రుషులు, మహర్షులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ పేరుపేరునా వారిని తలచుకుంటూ, వారికి వారసులమని మనం గర్వపడతాం.

Samayam Telugu 30 May 2019, 3:37 pm
హైందవ సంస్కృతిని సుసంపన్నం చేసిన రుషులు, మహర్షులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ పేరుపేరునా వారిని తలచుకుంటూ, వారికి వారసులమని మనం గర్వపడతాం. వ్యాసుడు మహాభారతం, అష్టాదశ పురాణాలు, వాల్మీకి రామాయణం లాంటి అద్బుతమైన కావ్యాలను మనకందించారు. ఇక, అనేక మంది రుషి పుంగవులు ఆధ్యాత్మిక, వైదిక విషయాలను తెలియజేశారు. అలాంటి గొప్పవారిలో ఆంగీరస మహర్షి ఒకరు. ఈయన బ్రహ్మ మానసపుత్రుడు. సృష్టికార్యంలో తనకు సహకరించేందుకు బ్రహ్మ తన మనోఫలకం నుంచి పదిమంది కుమారులకు జన్మనిచ్చాడు. వీరందరినీ బ్రహ్మ మానసపుత్రులని అంటారు. వీరిలో మూడోవాడు అంగీరసుడు. పదిమందిలోనూ ఒక్క నారదుడే ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయి సృష్టికార్యానికి దూరంగా ఉన్నాడు. మిగతా తొమ్మిది గృహస్థు ధర్మాన్ని పాటించి సంతానాన్ని వృద్ధి చేశారు. అందుకని వారిని నవబ్రహ్మలుగా పిలుస్తారు.
Samayam Telugu agnideva


అంగీరస మహర్షి భార్యల గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటిలో ముఖ్యమైంది మాత్రం కర్దమ ప్రజాపతి కుమార్తె శ్రద్ధతో వివాహం. కర్దమ ప్రజాపతికి తొమ్మిది మంది కుమార్తెలు. వీరందరినీ సమర్ధులకు ఇచ్చి వివాహం జరిపించాలని ఆయన నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో ఆయనకు నవబ్రహ్మల గురించి తెలిసింది. దీంతో తన తొమ్మిది మంది కుమార్తెలను వారికి ఇచ్చి వివాహం చేశారు. వారిలో శ్రద్ధ అనే కుమార్తెకు అంగీసునితో వివాహం జరిగింది. మహాపతివ్రతలుగా గుర్తింపు పొందిన అనసూయ, అరుంధతి ఈ శ్రద్ధకు తోబుట్టువులే!

అంగీరసుని గురించి ఒక విచిత్రమైన కథ పురాణాలలో కనిపిస్తుంది. ఒకసారి తోటి దేవతలపై అలిగిన అగ్నిదేవుడు అజ్ఙాతంలోకి వెళ్లిపోయాడట. అగ్ని లేకపోవడంతో ముల్లోకాలు అతలాకుతలం అయిపోయాయి. ఏ ఇంటిలోనూ పొయ్యి వెలగలేదు.. ఏ హోమంలోనూ నిప్పు రాజుకోలేదు. దీంతో బ్రహ్మదేవుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అగ్నిని మించిన తేజోవంతుడైన అంగీరసుడు ఆయన స్థానాన్ని భర్తీ చేయగలడని సూచించాడు. తండ్రి సూచనతో అగ్ని నిర్వహించే బాధ్యతలను అంగీరసుడు తలకెత్తుకొన్నాడు. తాను లేకపోయినా లోకం యథావిధిగా సాగిపోవడం చూసి అగ్నికి ఏం చేయాలో పాలుపోలేదు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవులు తనని మర్చిపోతారన్న భయపడ్డ అగ్నిదేవుడు తిరిగి తన బాధ్యతలను నిర్వహించేందుకు బయటకువచ్చాడు. అగ్నిదేవుని చూసిన అంగీరసుడు ఒక్క మాటైనా అనలేదు సరికదా, ఆయన బాధ్యతలను తిరిగి సంతోషంగా అప్పగించాడు. ఎంతటివారికైనా గర్వభంగం తప్పదనీ, వినయం ఉన్నవారినే విజయం వరిస్తుందని ఈ కథ తెలియజేస్తోంది.

గృహస్థ ధర్మాన్ని అంగీరసుడు ఏనాడూ విస్మరించలేదు. ఏడుగురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు మొత్తం పద్నాలుగు మంది సంతానం. దేవతల గురువైన బృహస్పతి అంగీరసుని పుత్రుడే. మరో కుమారుడు సంవర్తుడు విరాగిగా ఇప్పటికీ కాశీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడని అంటారు. అంగీరసుని ద్వారా వృద్ధి చెందినవారిని అంగీరసులు అంటారు. వీరు కాకుండా ముద్గల పురాణాన్ని రాసిన ముద్గల రుషి కూడా అంగీరసుని చెంత పెరిగినవాడే.

అటు గృహస్థుగా, ఇటు జ్ఞానిగానూ అంగీరసుడు ప్రఖ్యాతుడు. అందుకే ఆయనను సప్తర్షులలో ఒకరిగా పేర్కొంటారు. మానవ జీవితాన్ని నిర్దేశిస్తూ రాసిన స్మృతులనే గ్రంథాలలో అంగీరస మహర్షి రాసిన అంగీరసస్మృతి కూడా ఒకటి. ఉపనిషత్తులలోనూ అంగీరసుని ప్రస్తావన కనిపిస్తుంది. అంగీరసుడు శౌనకునికి ఉపదేశించిన బ్రహ్మజ్ఞాన సారం ముండకోపనిషత్తులో వినిపిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.