యాప్నగరం

భోగి పండ్లను పిల్లల నెత్తిన ఎందుకు పోస్తారు?

భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లను పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి..? ఇలా చేయడం వల్ల లభించే ప్రయోజనాలేంటి?

TNN 14 Jan 2019, 7:32 am
తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు.
Samayam Telugu speciality of bhogi pallu during sankranti festival
భోగి పండ్లను పిల్లల నెత్తిన ఎందుకు పోస్తారు?


సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.

రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.

భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.