యాప్నగరం

తిరుమలలో అంగరంగ వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు

వైశాఖశుద్ధ దశమి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆకాశరాజు తన కుమార్తె శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి.

Samayam Telugu 14 May 2019, 10:53 am
శ్రీపద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవాలు సోమవారం తిరుమలలో అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. సాయంత్రం బంగారు వాకిలి నుంచి శ్రీమలయప్పస్వామి గజవాహనాన్ని అధిరోహించి నారాయణగిరి ఉద్యానవనానికి ఊరేగింపుగా వెళుతుండగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకిపై అనుసరిస్తూ వేంచేశారు. నారాయణగిరి ఉద్యానవనంలోని దశావతార మండపాన్ని వివిధ రుచుల ఫలాలు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించారు. నిత్య వధూవరులైన తిరుమలేశునికి, ఉభయ దేవేరులకు ఎదుర్కోలు ఉత్సవం, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Samayam Telugu tirumala4


ఆ తరువాత శ్రీస్వామివారికి ఆస్థానం జరిగింది. ఈ కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీవేంకటేశ్వరస్వామికి వేదాలు, పురాణాలు, సంగీత రాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు. అనంతరం ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఈ క్రతువు తర్వాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారుతిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది. మే 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

వైశాఖశుద్ధ దశమి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆకాశరాజు తన కుమార్తె శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేసినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. నాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవాకి గుర్తుగా 1992 నుంచి ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు ఈ ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. శ్రీమలయప్పస్వామి తొలిరోజు గజవాహనం, రెండో రోజు అశ్వ వాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేయగా, ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.