యాప్నగరం

శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగడానికి పోటీపడ్డ భక్తులు

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహోత్సవాల్లో ఆరో రోజు గురువారం సాయంత్రం శ్రీనివాసుడి స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది.

TNN 28 Sep 2017, 6:06 pm
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహోత్సవాల్లో ఆరో రోజు గురువారం సాయంత్రం శ్రీనివాసుడి స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. కలియుగ వైకుంఠం గోవింద నామ స్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు అభయమిస్తున్నారు. స్వామివారి స్వర్ణ రథాన్ని లాగేందుకు మహిళలు పోటీపడ్డారు. శ్రీవారి రథోత్సవ సేవను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. రెండు గంటల పాటు తిరు మాడ వీధుల్లో మహిళా భక్తులే స్వర్ణ రథాన్ని లాగడం విశేషం.
Samayam Telugu tirumal brahmostavam sri vari swarna rathostavam
శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగడానికి పోటీపడ్డ భక్తులు



అంతకు ముందు శ్రీవారి పల్లకి వాహనసేవలో కళాబృందాల ప్రదర్శన భక్తజనులకు కనువిందు చేసింది. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో కళాబృందాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా గంగాడ గ్రామానికి చెందిన కళాకారుల తప్పెటగుళ్ల ప్రదర్శన భక్తులను అలరించింది. 15 మంది కళాకారులు పాదాలకు సిరిమువ్వలు, పెద్దమువ్వలు కట్టుకుని చేస్తున్న నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి.మధురైకు చెందిన ఆనంద్‌ శంఖుచక్ర నామాలతో కూడిన దశావతార గొడుగులతో వాహనసేవలో పాల్గొన్నారు. వివిధ రూపాల్లో వైవిధ్య వేషధారణతో సహకళాకారుల భక్తుల దృష్టిని ఆకర్షించారు.


రాజమహేంద్రవరానికి చెందిన హేమలత బృందం శ్రీకృష్ణుడి కాళీయమర్ధన ఘట్టాన్ని తిరువీధుల్లో ఆవిష్కరించింది. కళాకారులు శ్రీకృష్ణుడు, కాళీయ సర్ప వేషధారణలో చేసిన నృత్యరూపకం అబ్బురపరిచింది. పలమనేరుకు చెందిన శ్రీవేంకటేశ్వర జానపద భజన బృందం కళాకారుల కీలుగుర్రాల ప్రదర్శన ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. రవీంద్రబాబు బృందం ఆధ్వర్యంలో 15 మంది కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. పొడుగు కాళ్లతో కళాకారులు చేసిన విన్యాసాలు అందర్ని ఆకట్టుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.