యాప్నగరం

కొత్త జంటకు శ్రీవారి ఆశీసులు కావాలంటే....

మాంగల్యధారణ అంటే... నా జీవనానికి కారణమైన ఈ సూత్రంతో నీ మెడలో నేను మాంగళ్యాన్ని కడుతున్నాను. నీవు నిండు నూరేళ్లు జీవించు" అని అర్థం.

TNN 6 Feb 2017, 5:35 pm
మాంగల్యధారణ అంటే... నా జీవనానికి కారణమైన ఈ సూత్రాన్ని నీ మెడలో నేను కడుతున్నాను. నీవు నిండు నూరేళ్లు జీవించు అని అర్థం. హైందవ సనాతన ధర్మంలో వివాహ బంధానికి ఓ ప్రత్యేకస్థానం ఉంది. వధూవరులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన ఈ కార్యక్రమానికి లోకరక్షకుడైన ఆ శ్రీనివాసుని ఆశీస్సులు పొందితే అంతకన్నా భాగ్యం ఏముంటుంది.
Samayam Telugu ttd extends special privilege to newly married couples
కొత్త జంటకు శ్రీవారి ఆశీసులు కావాలంటే....


ఈ మహత్తర అవకాశాన్ని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. ఇందుకు చేయాల్సింది ఒక్కటే. పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపితే చాలు.
మానవ సమాజంలో గృహస్థ ధర్మం ఎంతో కీలకమైంది. కల్యాణంలో మొదటి ఘట్టంగా వధూవరులకు కంకణాన్ని చేతికి ధారణ చేస్తారు. విపత్కర పరిస్థితుల నుంచి కాపాడే రక్షాబంధనమైన కంకణాన్ని వరుడి కుడిచేతికి, వధువుకు ఎడమచేతికి కడతారు. దీని కోసం శ్రీపద్మావతి ఆశీస్సులతో శుభాలు కోరుతూ కుంకుమతోపాటు కంకణాన్ని పంపుతారు.

వివాహం సమయంలో చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది. కొత్త దంపతులకు సకల శుభాలు కలిగి సత్కర్మలు పెంపొందించాలని, దాంపత్యం ఫలప్రదం కావాలని, భార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులై సిరి సంపదలతో తులతూగాలని కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తితిదే తలంబ్రాలు పంపుతోంది.

గృహస్థ జీవితాన్ని కోరుకునే స్త్రీపురుషులకు అన్యోన్యత, అనురాగబంధంతో ముడివేసే వివాహ వ్యవస్థ గురించి తెలియజేసే టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య రచించిన కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని కార్యనిర్వహణాధికారి పేరిట వేద ఆశీర్వచనంతో నవ వధూవరులకు పంపుతారు.

తిరుమలలోని తితిదే పరిపాలనా (తపాలా విభాగం) విభాగం సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ఏటా వేలకుపైగా కొత్త జంటలకు శ్రీవారి ఆశీస్సులు అందిస్తున్నారు.

శ్రీవారి ఆశీస్సులు పొందాలనుకునే నూతన వధూవరులు కార్యనిర్వహణాధికారి, తితిదే పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు. తిరుపతి - 517501 చిరునామాకు వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు 0877-2233333, 2277777 నెంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.