యాప్నగరం

కుంభమేళాకు ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా!

భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే కుంభమేళా అరుదైన ఘనత సాధించింది. ఈ వేడుకను ప్రపంచ వారసత్వ సంస్కృతి జాబితాలో యునెస్కో చేర్చింది.

TNN 9 Dec 2017, 9:38 am
భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే కుంభమేళా అరుదైన ఘనత సాధించింది. ఈ వేడుకను ప్రపంచ వారసత్వ సంస్కృతి జాబితాలో యునెస్కో చేర్చింది. దక్షిణ కొరియాలోని జెజులో జరుగుతోన్న యునెస్కో 12వ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 4 న ప్రారంభమైన ఈ సమావేశం 9 వరకు కొనసాగుతుంది. వారసత్వ సంస్కృతి కల్పించడానికి రూపొందించిన జాబితాలో కుంభమేళాను చేర్చినట్టు యునెస్కో ట్విట్టర్ ద్వారా తెలిపింది. లక్షలాది మంది భారతీయులు హాజరయ్యే కుంభమేళాకు వారసత్వ సంస్కృతి హోదా కల్పించడం సరైందేనని ఆ సంస్థ ప్రకటించింది. వారసత్వ కట్టడాలు, సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాల గురించి సభ్య దేశాలు సమర్పించిన నామినేషన్లను నిపుణుల బృందం పరిశీలించి సిఫారసులు చేస్తుంది.
Samayam Telugu unesco recognises kumbh mela as indias cultural heritage
కుంభమేళాకు ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా!


భారత్ సమర్పించిన నామినేషన్లు పరిశీలించిన బృందం కుంభమేళాకు వారసత్వ సంస్కృతి హోదా కట్టబెట్టడం సమంజసమేనని పేర్కొంది. అంతేకాదు ఈ భూమి మీద శాంతి, సామరస్యాలతో జరిగే అతి పెద్ద యాత్రికుల సమ్మేళనంగా దీనిని అభివర్ణించింది. అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో నిర్వహించే ఈ వేడుక భారతదేశంలోని పవిత్రమైన నదుల ఆరాధన, ఆచారాల శుద్ధీకరణకు సంబంధించిందని వ్యాఖ్యానించింది. జ్ఞానం, నైపుణ్యాలను గురు-శిష్యపరంపర ద్వారా కుంభమేళ బోధిస్తుందని, సాధువులు, యోగులు భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను తమ శిష్యులకు అందించేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. 2015 డిసెంబరులో యోగాను, ఇరాన్ సంప్రదాయం నౌరుజ్‌ను కూడా యునెస్కో వారసత్వపు సంస్కృతి జాబితాలో చేర్చింది.

కుంభమేళా సమయంలో కోట్లాది మంది నదుల దగ్గరకు చేరుకుని వేడుక చేసుకుంటారు. ప్రపంచంలో అంత భారీగా భక్తులు హాజరుకావడం ఒక్క కుంభమేళాకు మాత్రమే సాధ్యం. ఈ క్రమంలోనే కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ జాబితాలో బొత్సవానా, ఇరాన్, కొలంబియా, వెనీజులా, మంగోలియా, మొరాకో, టర్కీ, యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే వేడుకలు మాత్రమే ఉన్నాయి.

దీనిపై కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మనీష్ శర్మ స్పందిస్తూ, 'మన కుంభమేళాకు ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ గర్వకారణం. ఇది అత్యంత అరుదైన గౌరవం' అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల సమాజం ప్రకారం అందరూ సమానమే భావనను కుంభమేళా కలిగి ఉందని, విభిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఎలాంటి వివక్షత లేకుండా పాల్గొంటారని.... ఒక మతపరమైన ఉత్సవంలో కులమతాలకు అతీతంగా సహనం ప్రదర్శించి అందరూ సమానమనే విలువలను పాటిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.