యాప్నగరం

ఆ మహర్షి త్యాగంతో వజ్రాయుధం పుట్టింది!

స్వార్థంతో కోరుకునే వరాలు లోకానికే కాదు, కోరుకున్న వారికి కూడా మంచి చేయవు.. నిస్వార్థంతో చేసిన స్వల్పదానమైనా చిరస్థాయిగా నిలిచిపోతాయని చరిత్రలు, పురాణాలు చెబుతున్నాయి.

TNN 22 Feb 2018, 5:25 pm
స్వార్థంతో కోరుకునే వరాలు లోకానికే కాదు, కోరుకున్న వారికి కూడా మంచి చేయవు.. నిస్వార్థంతో చేసిన స్వల్పదానమైనా చిరస్థాయిగా నిలిచిపోతాయని చరిత్రలు, పురాణాలు చెబుతున్నాయి. దీనికి ఉదాహరణే రాక్షస వీరుడు వృత్రాసురుడు, దధీచి మహాముని జీవితాలు. మహాశక్తి సంపన్నుడైన రాక్షసుడు వృత్రాసురుడు. దేవతలపైన ద్వేషంతో తపస్సు చేశాడు. లోహంతో తయారుచేయని ఆయుధం తప్ప మరే ఇతర వాటితో చావు ఉండరాదని వరం పొందాడు. ఆ వరానికి, రాక్షసబలం తోడుకావడంతో అతడికి ఎదురు లేకుండా పోయింది. వర గర్వంతో దేవలోకం మీదకు దండెత్తిన వృత్రాసురుడు, ఇంద్రుడిని ఓడించి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. దేవతలందరినీ హింసించాడు. వాణ్ని ఏమీచేయలేక దేవేంద్రుడు దేవతలను వెంటబెట్టుకుని విష్ణుమూర్తి వద్దకెళ్లి, మొరపెట్టుకున్నాడు.
Samayam Telugu vajrayudha making with sage dadhichi spine
ఆ మహర్షి త్యాగంతో వజ్రాయుధం పుట్టింది!


వారి మొర విన్న శ్రీహరి అత్యంత బలమైన వెన్నుముకతో పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచించాడు. ఏనుగు, సింహం, పులి లాంటి జంతువుల ఎముకలు బలిష్ఠంగా ఉంటాయి కాబట్టి అవి ఆయుధ తయారీకి పనికొస్తాయని దేవతలు భావించారు. అయితే మీ ఆలోచన సరైందిది కాదు. బలంతోపాటు, తపశ్శక్తి కూడా కలబోసిన ఎముకలై ఉండాలి, భృగుమహర్షి కుమారుడు, మహాతపస్సంపన్నుడైన దధీచి వెన్నెముక అందుకు బాగా ఉపయోగపడుతుందని నారాయణుడు సెలవిచ్చాడు. దేవశిల్పి, దేవగురువులతో దధీచి ముని ఆశ్రమానికి వెళ్లి, విషయాన్ని తెలియజేయమని విష్ణుమూర్తి ఆఙ్ఞాపించారు.

దీంతో బృహస్పతి, విశ్వకర్మలను దేవేంద్రుడు వెంటబెట్టుకుని దధీచి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. వారి రాకకు సంతోషించిన దధీచ మహర్షి అతిథి సత్కారాలు చేశారు. తాము వచ్చిన కారణాన్ని ఎలా వివరించాలో తెలియక దేవేంద్రుడు సంకోచించాడు. అయితే మహర్షి వారిని గుచ్చిగుచ్చి అడగడంతో ఎట్టకేలకు అసలు విషయాన్ని వెల్లడించారు. వారి మాటల విన్న మహర్షి తన వెన్నుముక ఇవ్వడానికి ఆనందంగా అంగీకరించారు. యోగశక్తితో తన ప్రాణత్యాగం చేశాడు. లోక కల్యాణం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన దధీచి, అవయవదానానికి ఆద్యుడయ్యాడు. దధీచి మహర్షి వెన్నెముక నుంచి తయారైందే వజ్రాయుధం. ఈ వజ్రాయుధంతోనే వృత్రాసురుని వధించాడు దేవేంద్రుడు. మంచికి, త్యాగానికి మారుపేరైన దధీచి మహర్షి చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన వెన్నెముకతో చేసిన వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.