యాప్నగరం

జపం అంటే ఏంటి? దీని వల్ల ప్రయోజనం ఉందా?

భగవంతుని ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో చాలా ముఖ్యమైనది, అందరూ సులభంగా చేయగలిగేది జపం ఒక్కటే.

TNN 21 May 2017, 2:23 pm
భగవంతుని ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో చాలా ముఖ్యమైనది, అందరూ సులభంగా చేయగలిగేది జపం ఒక్కటే. మొక్కుబడిగా, కాలక్షేపానికి కాకుండా ఓ పద్ధతి ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అయితే రోజుకు ఎన్నిసార్లు జపం చేయాలి, ఏ విధంగా చేయాలి అనే నియమాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకోండి.
Samayam Telugu what is the japa and spiritually benfits of japa
జపం అంటే ఏంటి? దీని వల్ల ప్రయోజనం ఉందా?


‘వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధః స్మృతః, త్రయాణాం జపయఙ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరమ్’అంటే వాచికము, ఉపాంశువు, మానసికం అనే మూడు విధానాల్లో జపాన్ని ఆచరించవచ్చు. బయటకు వినిపించే విధంగా భగవంతుడిని స్మరిస్తే దాన్ని వాచికం అని, శబ్దాలేవీ బయటకు రాకుండా కేవలం పెదవులు కదుపుతూ, నాలికతో చేసే జపాన్ని ఉపాంశువు అని అంటారు. నాలిక, పెదవులు రెండూ కదపకుండా, నిశ్చలంగా మనసులో చేసే జపాన్ని మానసికం అంటారు.

‘హస్తౌ నాభిసమౌ కృత్వా ప్రాతస్సంధ్యా జపం చరేత్, హృత్సమౌ తు కరౌ మధ్యే సాయం ముఖ సమౌ కరౌ’ ప్రాతఃకాలంలో జపమాచరించేటప్పుడు చేతులను నాభి దగ్గర ఉంచాలి. మధ్యాహ్నం పూట జపం చేసేటప్పుడు చేతులను హృదయం దగ్గర ఉంచాలి. సాయంత్రం వేళ చేతులను ముఖానికి సమాంతరంగా ఉంచుకోవాలి. అలాగే చందనమాల, అక్షతలు, పువ్వులు, ధాన్యం, మట్టిపూసలను జపమాలగా ఉపయోగించరాదు. సింధూరపూసలు, దర్భ, ఎండిన ఆవుపేడ పూసలు, రుద్రాక్షలు, తులసి మాల లేదా స్ఫటిక మాలలు జపానికి శ్రేష్టమని పురాణాలు పేర్కొన్నాయి.

జపమాలలోని పూసలు ఖచ్చితంగా 108 ఉండేలా చూసుకోవాలి. జపమాల రెండు చివరలను కలిపే పూసను ‘సుమేరుపూస’ అంటారు. జపం చేసేటప్పుడు మాల కనిపించకుండా పైన ఒక శుభ్రమైన వస్త్రాన్ని కప్పి ఉంచాలి. జపమాలను ఉంగరపు వేలు పై నుంచి చూపుడు వేలును ఉపయోగించకుండా బొటన వేలితో పూసలను లెక్కించాలి. సుమేరుపూసను దాటి ముందుకు పోకుండా మాలను వెనుకకు తిప్పి జపం చేయాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.